Jun 04,2023 23:34

ధారాలమ్మ ఆలయం వద్ద క్యూలైన్లలో భక్తులు

- సౌకర్యాల్లేక ఇబ్బందులు
ప్రజాశక్తి -సీలేరు

జికె.వీధి మండలం, ధారకొండ ఘాట్‌రోడ్డులోని వెలసిన ధారాలమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం భక్తులతో కిటకిట లాడింది. అనంతపురం, తుని, అన్నవరం, విశాఖపట్నం, నర్సీపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాల నుండి భక్తులు ప్రత్యేక వాహనాల్లో అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. కొంతమంది భక్తులు మేకలు, కోళ్లతో మొక్కుబడులు తీర్చుకొని అక్కడే వంటలు చేసుకొని భోజనాలు చేశారు. పెద్ద సంఖ్యలో వాహనాల రాకతో ఆలయ సమీప ప్రధాన రహదారి ప్రమాదపు మలుపు నుంచి అమ్మవారి ఆలయం ప్రధాన రహదారి కింది వరకు వాహనాలు రోడ్డు నిలిచిపోవడంతో రవాణా సౌకర్యానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తు సేదతీరడానికి ఎటువంటి విశ్రాంతి భవనాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారు. వంటలు చేసుకోవడానికి వంటశాలలు కూడా లేకపోవడంతో ఆరుబయటే వంటలు చేసుకొని ఎండ వేడిమికి తాళలేక అనేక అవస్థలు పడ్డారు. పూర్తిస్థాయిలో టాయిలెట్లు సౌకర్యం లేక స్త్రీలు ఇబ్బంది పడ్డారు. ధారాలమ్మ అమ్మవారి ఆలయానికి రోజురోజుకీ భక్తులు తాకిడి పెరిగిపోతుంది. అమ్మవారికి ధన, కానుకలు రూపన అధిక ఆదాయం వస్తుంది. అయినప్పటికీ భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దేవాదయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా భక్తులు ఇబ్బందులను గుర్తించి ధారకొండ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వసతి భవనాలు, వంటశాలలు, టాయిలెట్లు, స్నానాలు ఆచరించడానికి పూర్తిస్థాయిలో నీరు, తాగునీరు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.