Dec 20,2022 22:19

ఇప్పటి వరకూ సగం ధాన్యమే కొనుగోలు
మాసూళ్లు పూర్తయినా కళ్లాల్లోనే పంట
తేమ శాతం పేరుతో మిల్లర్లు ముప్పుతిప్పలు
సొమ్ము జమపై రైతుల్లో టెన్షన్‌
ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకూ రూ.94 కోట్లు జమ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు వరి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌ మాసూళ్లు పూర్తయినా పండిన పంట ఇంకా సగం కళ్లాల్లోనే ఉంది. రెండు జిల్లాల్లోనూ ఇప్పటి వరకూ నిర్ధేశించిన లక్ష్యంలో 60 శాతానికిలోపే ధాన్యం కొనుగోలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. దాదాపుగా ఇంకా సగం ధాన్యం కళ్లాల్లోనే ఉంది. తేమపేరుతో మిల్లర్లు పెడుతున్న ఇబ్బందులతో రైతులు విసిగివేసారిపోతున్నారు. దీంతో ధాన్యం రైతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఖరీఫ్‌లో రెండు జిల్లాలవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఖరీఫ్‌ మాసూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ధాన్యం అమ్ముకునేందుకు రైతుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సంచులు దొరకక, లారీలు లేక, జట్టు అందుబాటులో లేక, యాప్‌లు పని చేయక రోజుకో సమస్య అన్నట్లు పరిస్థితి తయారైంది. ఖరీఫ్‌ మాసూళ్లు మొదలై దాదాపు 25 రోజులు దాటిపోయింది. ఏలూరు జిల్లాలో 3.80 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యమవ్వగా ఇప్పటి వరకూ 2.05 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో 3.42 లక్షల టన్నుల ధాన్యం లక్ష్యం కాగా 60 శాతంలోపు ధాన్యం కొనుగోలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. రెండు జిల్లాల్లోనూ దాదాపు ఇంకా సగం ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికీ వేగంగా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. ధాన్యం విక్రయించేందుకు అన్నదాత పడుతున్న అవస్థలు ఇప్పటికీ తీరలేదు.
తేమ పేరుతో మిల్లర్లు ముప్పుతిప్పలు
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నూతన విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం చాలా బాగుందంటూ అధికారులు చెబుతున్న గొప్పలకు.. క్షేత్రస్థాయి పరిస్థితులకు సంబంధం లేదు. ధాన్యర ఆరబెట్టిన తర్వాత రైతుభరోసా కేంద్రం సిబ్బంది వచ్చి తేమశాతం పరిశీలిస్తున్నారు. 17 శాతానికి తక్కువగానే ఉందని నిర్థారించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం లారీలో లోడు చేసి మిల్లు వద్దకు వెళ్లాక తేమశాతం ఎక్కువగా ఉందని మిల్లర్లు తిప్పి పంపుతున్నారు. లేకపోతే లారీలో అక్కడే నిలిపివేస్తున్నారు. దీంతో రైతులు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖాధికారుల వద్దకు పరుగులు తీయాల్సి వస్తోంది. చివరికి మిల్లర్లు నిర్ధేశించిన తేమశాతం ప్రకారం ధర తగ్గించడం వంటివి చేసిన తర్వాతే ధాన్యం తీసుకుంటున్నారు. ఇప్పటికీ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో తేమశాతం ఒకటి. అదేవిధంగా ఇక్కడ వేబ్రిడ్జిపై తూకం సరిపోయినా మిల్లుకు వెళ్లిన తర్వాత తూకం తగ్గిందని రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులతో రైతులు సతమతమవుతుండగా నూతన విధానం చాలా బాగుందని రైతులు చెబుతున్నారు. నూతన విధానంలో రైతులకు పూర్తిస్థాయిలో ధర అందుతుందని గొప్పలు చెబుతున్నా గతంలోకంటే అదనంగా జట్టు బిల్లు, తూకంలో కోత, తేమశాతం పేరుతో కోత, లారీలకు ఇచ్చే మామూళ్లు అన్నీ చూస్తే రైతులు చాలా నష్టపోతున్నారు. నూతన విధానంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా అధికారులు మాత్రం అంతా భేష్‌ అంటున్న తీరు విస్మయం కల్గిస్తోంది.
ధాన్యం సొమ్ముపై టెన్షన్‌
ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో సొమ్ము జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకూ ఏలూరు జిల్లాలో 43,845 మంది రైతుల నుంచి 2.05 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. మొత్తం రూ.420 కోట్లు ధాన్యం కొనుగోలు జరగ్గా ఇప్పటి వరకూ జమైన సొమ్ము రూ.94 కోట్లు మాత్రమే. పశ్చిమగోదావరి జిల్లాలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. మిగిలిన సొమ్ము సకాలంలో జమవుతుందా.. లేదా అనే టెన్షన్‌ రైతులను వెంటాడుతోంది. గతంలోనూ తొలుత సొమ్ము వెంటనే జమ చేయడం, తర్వాత నెలలు తరబడి ఇవ్వకపోవడం జరిగింది. ఈసారి అటువంటి పరిస్థితి పునరావృతమవుతుందేమోననే భయం రైతులను వెంటాడుతోంది. త్వరితగతిన సొమ్ము జమ చేయాలని రైతులు కోరుతున్నారు.