
గడిచిన రబీలో ధాన్యంకొనుగోలులో తీవ్ర ఇబ్బందులు
లారీలు, గోనెసంచులు లేక నానా అవస్థలు
చితుకు, తేమ పేరుతో మిల్లర దోపిడీ
ఎదురు సొమ్ములు చెల్లించలేక రైతుల్లో తీవ్ర ఆవేదన
ప్రతి సీజన్‌లోనూ ఇదే పరిస్థితి..పరిష్కారం కాని సమస్యలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
పంట చివరి దశకు చేరుతుందంటే రైతుల్లో ఒక్కటే భయం వెంటాడుతోంది. ఈసారైన ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా ఉంటాయా..? అన్న ఆందోళన రైతులను పట్టిపీడిస్తోంది. 'పండించిన ధాన్యం సవ్యంగా కొనుగోలు చేస్తారా.. లారీలు దొరుకుతాయా.. సంచులు ఇస్తారా' ఇలా అనేక అనుమానాలు రైతులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఒక్కటే ప్రతీసీజన్‌లో ధాన్యం అమ్ముకునేందుకు జిల్లా రైతాంగం పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. చేతికొచ్చిన ధాన్యం అమ్ముకోవడం రైతులకు మహాయజ్ఞంలా మారిపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరవడం నుంచి లారీలు పంపించకపోవడం, సంచులు అందించకపోవడం, సొమ్ములు సకాలంలో ఖాతాల్లో వేయకపోవడం, తేమ, చితుక(ముక్క) పేరుతో రైతులను నానా ఇబ్బందులు గురిచేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రెండు జిల్లాలోనూ దాదాపు నాలుగులక్షల ఎకరాల్లో రైతులు వరిసాగుచేశారు. నవంబర్, రెండోవారం నుంచి ఖరీఫ్‌సీజన్ ప్రారంభంకానుంది. దీంతో రైతులను ఇప్పటినుంచే ధాన్యం కొనుగోలు భయం వెంటాడుతోంది. గడిచిన శుక్రవారం ఏలూరు జిల్లాలో వ్యవసాయ సలహామండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై చర్చ సాగింది. సంచులు అందుబాటులో ఉంచడంతోపాటు, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ జిల్లాకలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతిఏటా ఇదేవిధంగా సమావేశాల్లో చర్చిస్తున్నా వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి భిన్నంగా ఉంటుంది. మాసూలు చేసి 15 రోజులు గడిచినా లారీలు దొరకడం లేదు. దీంతో రైతులు సొంతంగా లారీలు కట్టించుకోవడంతో పెద్దఎత్తున ఖర్చవుతోంది. తీరా లారీలు రైతులే చూసుకుని ధాన్యం పంపించినా మిల్లర్లు పెడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. స్థానిక వ్యవసాయాధికారులు తేమశాతం పరిశీలించి అనుమతిస్తున్నా మిల్లర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. తేమశాతం ఎక్కువగా ఉందంటూ రైతుల నుంచి డబ్బు కట్టించుకుంటున్నారు. గడిచిన రబీలో ధాన్యం చితుకు అవుతుందంటూ రైతుల నుంచి సొమ్ములు ఎదురు కట్టించుకున్న ఉదంతాలు బహిరంగంగానే సాగాయి. దీంతో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు పడుతున్న ఇబ్బందులు ప్రతిఏటా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
లారీలు, గోనెసంచులు ఏర్పాటులో నిర్లక్ష్యం
ధాన్యం పట్టేందుకు గోనెసంచులు, తరలించేందుకు లారీల ఏర్పాటులో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. అదేమని అడిగితే ఒకేసారి మాసూలు పూర్తవడంతో ఇబ్బందులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు మండలాల్లో ఒకేసారి మాసూళ్లు రావడం ఎప్పుడూ జరిగేది. అందుకు తగినట్లుగా ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకేసారి మాసూళ్లు పూర్తవుతాయని ముందుగానే అందరికీ తెలిసిందే. కానీ అందుకు తగిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. మిల్లుల కేటాయింపు సైతం దారుణంగా ఉంటుంది. నిడమర్రు మండలంలోని రైతులకు పెదపాడు, నూజివీడు మిల్లులను కేటాయిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదేవిషయంపై కొద్దిరోజుల క్రితం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రస్తావించారు. ధాన్యం సొమ్ము జమలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 21 రోజుల వ్యవధిలో రైతులకు సొమ్ములు జమకావడం లేదు. గడిచిన రబీ సీజన్‌లో కొంత ఫర్వాలేదన్నట్లు పరిస్థితిసాగింది. వచ్చే ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో గతంలో ఏర్పడిన సమస్యలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం కోరుతోంది.