![](/sites/default/files/2023-11/coll_23.jpg)
ప్రజాశక్తి - పార్వతీపురం : జిల్లాలో పండిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తామని కలెక్టరు నిశాంత్ కుమార్ అన్నారు. ధాన్యం సేకరణకు పూర్తి ఏర్పాట్లు చేశామని, సేకరణ పట్ల అపోహలు, రూమర్లు సృష్టించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టరు హెచ్చరించారు. ధాన్యం సేకరణపై అధికారులు, మిల్లర్లు, లారీ సంఘ ప్రతినిధులతో శుక్రవారం జిల్లా కలెక్టరు సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3.23 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి అంచనా వేశామని, రైతులు తమ ధాన్యాన్ని జిల్లాలో ఏర్పాటు చేసిన 185 కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు విక్రయించ వచ్చని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకంటే తక్కువకు విక్రయించొద్దని సూచించారు. రైతులను ప్రలోభాలు, ఇబ్బందిపెట్టి తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుభరోసా కేంద్రం స్థాయిలో వాలంటీర్లకు సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం సేకరణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణపై గ్రామాల్లో ఎవరైనా అపోహలు సృష్టిస్తే వాలంటీర్లు సమాచారం అందించాలని ఆయన స్పష్టం చేశారు.
ధాన్యం సేకరణలో మొదటి పదిరోజులు కీలకమని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని అంచనా వేసి ముందుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందుల్లేకుండా, రైతుల నుంచి ఫిర్యాదుల్లేకుండా సివిల్ సప్లయి, రవాణా, వెలుగు, జిసిసి, వ్యవసాయ, సహకారశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గతేడాది ఎదురైన ఇబ్బందులు, లోపాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంచనాలకు మించి వాహనాలు సిద్ధం చేయాలన్నారు. మిల్లర్లు బ్యాంకు గ్రారంటీలను ఈనెల 20కల్లా అందించాలని, మిల్లర్ల బకాయిలు బ్యాంకు గ్యారంటీలుగా మార్చాల న్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన 15లక్షల గన్నీ బ్యాగులు సిద్ధం చేసి, రైతు భరోసా కేంద్రాలకు పంపిస్తామన్నారు. టెస్టింగు మిషన్లు, బయోమెట్రిక్ మిషన్లు సిద్ధం చేయాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐటిడిఎ పిఒలు, ఆర్‌డిఒలు, వ్యవసాయ, సివిల్ సప్లయి అధికారులు ప్రతిరోజు ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. వాతావరణ మార్పులపై రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని వ్యవసాయ అధికారులకు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు ఆర్.గోవిందరావు, ఆర్‌డిఒలు కె.హేమలత, ఎం.లావణ్య, సివిల్ సప్లయి జిల్లా మేనేజరు ఎం.దేవుళ్ల నాయక్, జిల్లా సప్లయి అధికారి శివ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అదికారి కె.రాబర్ట్ పాల్, అధికారులు పాల్గొన్నారు.