ప్రజాశక్తి - ఉంగుటూరు
రబీధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేనిపక్షంలో మంగళవారం నుంచి జాతీయ రహదారులపై ఆందోళన చేపడతామని టిడిపి, భారతీయ కిసాన్ సంఫ్‌ు నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఉంగుటూరు తహశీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మాజీ ఎంఎల్‌ఎ గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, రైతులు చేరుకున్నారు. నాణ్యమైన గోనె సంచులు సరఫరా చేయాలని, ధాన్యం పట్టుబడులు పట్టిన తక్షణం లారీలను పంపించేలా చర్యలు తీసుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే రేపటి నుంచి రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తహశీల్దారు ఎవి.రమణారావు మాట్లాడుతూ గోనె సంచులు పుష్కలంగా వస్తున్నాయని, లారీల ఇబ్బందులు సైతం తొలగించేలా జిల్లాయంత్రాంగం అన్నిచర్యలూ తీసుకుంటుందని, ఆందోళన చెందొద్దని రైతులు, నాయకులకు వివరించారు.










