ప్రజాశక్తి - పార్వతీపురం : జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ లో ధాన్యం సేకరణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో మంగళవారం జరిగింది. ధాన్యం సేకరణకు గోనె బస్తాలను ముందస్తుగా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. అక్టోబరు నెలాఖరుకు 25 లక్షల గోనె బస్తాలను సిద్దం చేయాలని, అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని, సిబ్బంది నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు. యాప్‌ల వినియోగంలో సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. కూలీలు, రవాణాకు కార్యాచరణ ప్రణాళిక ఉండాలన్నారు. చెల్లింపుల యాప్‌లో నమోదు చేయాల్సిన వాహనాల వివరాలు సేకరించి ముందుగా నమోదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంక్ గ్యారంటీ నిర్దేశిత సమయంలో ఇవ్వాలని సూచించారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మిల్లర్లు, రవాణా, గోనె సంచులు, బ్యాంక్ గ్యారంటీ తదితర అంశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్ మాట్లాడుతూ 2023 - 24 సంవత్సరానికి క్వింటాల్ కు గ్రేడ్ - ఏ రకం రూ.2203, సాధారణ రకంకు రూ.2183గా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. వ్యవసాయ గణాంకాల ప్రకారం సాధారణ పంట విస్తీర్ణం 1,74,632 ఎకరాలు కాగా, 1,41732 ఎకరాలలో ఊబాలు పూర్తి అయ్యాయని వివరించారు. 18094 ఎకరాలకు ఇ-క్రాప్ చేశారని ఆయన చెప్పారు. నవంబరు 15 నాటికి ధాన్యం విక్రయానికి వచ్చే అవకాశం ఉందని వివరించారు. గత ఏడాది 188 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో కేటగిరీ - ఏ లో 52, కేటగిరీ - బి 120, కేటగిరీ - సి లో 16 ఉన్నాయని, వీటిని కొనసాగిస్తామని చెప్పారు. సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశామనిపేర్కొన్నారు. పిఎసిఎస్‌ల ద్వారా 41, గిరి వెలుగు ద్వారా 12, జిసిసి ద్వారా 7, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా 4, ఎఫ్.పి. ఓ ల ద్వారా 14 నడుపుతున్నట్లు ఆయన చెప్పారు. అన్ని పిపిసిలకు పరికరాలు సిద్ధంగా ఉన్నాయని డి.ఎం తెలిపారు. 47 వెయింగ్ బ్రిడ్జిలు, 129 ఎలక్ట్రానిక్ వేయింగ్ స్కేల్స్ ఉన్నాయని తెలిపారు.
పిఎం కిసాన్ రైతుల వివరాలు నమోదు చేయాలి
రైతులకు ఖరీఫ్ సీజన్ కి పెట్టుబడిసాయం కింద అందించే పిఎం కిసాన్ పథకం వర్తించేందుకు లబ్ధిదారుల ఖాతా నెంబరుకు ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణాలు, ఇ - క్రాప్ నమోదు, పిఎం కిసాన్ పథకం వర్తింపు, ఉపాధి హామీ, ప్రాధాన్యతా భవనాలు, రీ సర్వే, తదితర అంశాలపై మండల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భూమి వివరాలను వెబ్ ల్యాండ్‌లో నమోదైనట్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నమోదు కాని పక్షంలో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందే అవకాశం లేదని, అర్హులైన ప్రతి రైతుకు పథకం వర్తించాలన్నారు. బలిజిపేటలో 1240 వరకు నమోదు జరగాల్సి ఉందని, ప్రత్యేక యాప్‌లో ఆధార్ అనుసంధానం జరగాలన్నారు. మ్యూటేషన్ పూర్తి చేయాల న్నారు. సెప్టెంబర్ 5లోగా పూర్తి స్థాయిలో యుద్దప్రాతిపదికన నమోదు ప్రక్రియ జరగాలన్నారు. జిల్లాలో నిర్దేశించిన గృహ నిర్మాణాల లక్ష్యం సాధించేందుకు ఇంటి పైకప్పు స్థాయి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికి లక్ష్యాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ చట్టం కింద గ్రామాల్లో నిర్వహించనున్న ఎవెన్యూ, బన్డ్ ప్లాంటేషన్ పూర్తికి ఎంపిడిఒ బాధ్యత వహించి శత శాతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు నెలాఖరుకు రీ సర్వే చేసిన ప్రాంతాల్లో సర్వే రాళ్లు పాతాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే ఓటరు పునశ్చరణ పక్కాగా జరగాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో తప్పు, ఒప్పులకు ఓటరు నమోదు అధికారి (ఇఆర్‌ఒ)దే పూర్తి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, డిఆర్‌ఒ జె.వెంకటరావు, ఆర్‌డిఒ కె.హేమలత, జిల్లా సహకార అధికారి సన్యాసినాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జె.ఎల్.ఎన్ మూర్తి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం. శశికుమార్, జిసిసి డివిజనల్ మేనేజర్లు వి. మహేంద్ర, సంధ్య, జిల్లా సరఫరా అధికారి శివ ప్రసాద్, జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగు అధికారి ఎల్. అశోక్ కుమార్, మిల్లర్లు, రవాణా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.










