సివిల్ సప్లయీస్ ఎమ్‌డి వీరపాండ్యన్
ప్రజాశక్తి - ఉంగుటూరు
ఇకమీదట ధాన్యం సేకరణ వాహనాలకు జిపిఎస్ ట్యాగింగ్ చేసి ట్రాకింగ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని, ఇందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ విసిఅండ్‌ఎమ్‌డి జి.వీరపాండ్యన్ అన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు, రైతుల నుంచి సమగ్ర వివరాలను తెలుసుకునేందుకు ఆయన మంగళవారం మండలానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వెల్లమిల్లి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. జిపిఎస్ ట్రాకింగ్ విధానాన్ని పరిశీలించామని, కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు చేరే వరకూ వాహనాన్ని ట్రాకింగ్ చేస్తామని తెలిపారు. అనంతరం ఉంగుటూరు తహశీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులు, జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణితో కలిసి వీరపాండ్యన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా సిబ్బందికి దిశానిర్దేశం చేశామన్నారు. రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా అధికారులకు తెలియజేయాలన్నారు. కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన తేమ శాతం, తూకం యంత్రాలను, డేటా ఎంట్రీ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలించి, అధికారులు సిబ్బందికి సూచనలు చేయాలన్నారు. జెసి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సాంకేతిక సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించి శిక్షణ ఇచ్చామన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద ఫిర్యాదులు చేసేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయి కంట్రోల్ రూము ఫోన్ నంబర్ల అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులను ఎప్పటికప్పుడు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ జిల్లా మేనేజరు మంజు భార్గవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
ఫ్లయింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటు
ధాన్యం సేకరణలో ప్రధానంలో గన్నీ బ్యాగులు, లారీ, రవాణా వంటి ప్రణాళిక ఖచ్చితంగా అధికారుల వద్ద ఉండాలని, దీనికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జి.వీరపాండ్యన్ అన్నారు. మంగళవారం రాత్రి ఉంగుటూరు తహశీల్దారు కార్యాలయంలో ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులు, మిల్లర్లతో ఆయన సమీక్షించారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం తేమ, బ్రేకింగ్ శాతం ఎంత ఉందో మిల్లర్ల వద్ద కూడా అంతే ఉండేలా పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి అందులో సీనియర్లను కస్టోడియన్ అధికారులుగా నియమించాలని ఆదేశించారు. ఖరీఫ్‌లో ఈ నెల 20 నుంచి ధాన్యం సేకరణ మొదటిసారిగా ఉంగుటూరు మండలంలో ప్రారంభించాలని ఆదేశించారు. రైతుల నుండి ధాన్యం వివరాలు నమోదు చేసినప్పుడే గోనె సంచుల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతీ వాహనానికి జిపిఎస్ డివైజ్ అమర్చిన వాటిలోనే ధాన్యం రవాణా చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.










