రైతుల ఒత్తిడితో అదనంగా 10 వేల టన్నులు పెంచిన ప్రభుత్వం
పూర్తిగా అందని తొలివిడత సొమ్ము
ప్రజాశక్తి - భీమడోలు
రైతుల ఒత్తిడితో ప్రభుత్వం భీమడోలు మండలంలో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని మరొక పది వేల టన్నులకు పెంచింది. గతంలో పౌరసరఫరాల సంస్థ తొలుత 33 వేల టన్నులు ఆ తర్వాత మరొక వెయ్యి టన్నులు కలిపి 34 వేల టన్నులు ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఇంకా మండలంలో 15 వేల టన్నులకు పైబడి ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందని అంచన. మండలంలో 13,200 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు జరగగా ప్రభుత్వం 57 వేల టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కట్టింది. కాని ఆ తర్వాత పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 34 వేలకు మాత్రమే పరిమితం చేసింది. ఈ మేరకు సిద్ధం చేసిన 8.90 లక్షలు గోనె సంచులను పంపిణీ చేశారు. ఆ మేరకు ధాన్యం ఎగుమతి జరిగింది. దీంతో గోనె సంచుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నియంత్రించారు. మిగులు ధాన్యం కొనుగోలు విషయమై రైతుల ఒత్తిడి పెరిగింది. దీంతో పాటు తమ అవసరం మేరకు గోనె సంచులను సరఫరా చేయాలని, ధాన్యం రవాణా కోసం వాహనాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇదే విషయమై ఎపి రైతు సంఘం, సిపిఎం రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం మరొక పదివేల టన్నులు ధాన్యం కొనుగోలుకు అనుమతించింది. ఇప్పటికే కొంతమంది రైతులు ధాన్యాన్ని ప్రయివేట్ వ్యక్తులకు ఆమ్మిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్ణయించిన లక్ష్యంతో రైతుల వద్ద మిగిలి ఉన్న ధాన్యం కొనుగోలు పూర్తవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మిగిలి ఉన్న గోనె సంచుల పంపిణీ పోను ఐదు వేల టన్నుల ధాన్యం సేకరణకు 1.25 లక్షల గోనె సంచులు తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తొలివిడతగా ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు రూ.59.87 కోట్లు చెల్లించవలసి ఉండగా ఇప్పటివరకు రూ.42.92 కోట్లు చెల్లించామని అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా రైతుల వద్ద మిగిలిన ధాన్యం కొనుగోలు కోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన గోనె సంచులను సరఫరా చేయడంతో పాటు ధాన్యం రవాణా విషయమై ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయాలపై వాతావరణ పరిస్థితులపై సైతం అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.










