Mar 01,2022 07:21

     కొన్నేళ్ల కింద పల్లె సమాజంలో వరి పండించే రైతంటే గొప్ప. ఇప్పుడు ధాన్యం రైతు ఎందుకూ కొరగావడంలేదు. పండించిన ధాన్యాన్ని కొనే నాధుడే లేడు. గిట్టుబాటు ధర కలలో మాట. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) లక్కీ చాన్సే. ప్రతి గింజకూ ఎంఎస్‌పి ఇచ్చి తీరతామన్న సర్కారీ శపథాలు మీడియా వార్తలకే పరిమితం. ఎప్పటిలాగానే ఈ ఖరీఫ్‌లోనూ ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్లాన్‌ చేసింది. సీజన్‌లో 80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేసి, 50 లక్షల టన్నులు పౌర సరఫరాల శాఖ సేకరిస్తుందన్నారు. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలే (ఆర్‌బికె) ధాన్యం కొనుగోలు కేంద్రాలనీ టముకేశారు. అక్కడ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాక ధాన్యాన్ని రైతులు మిల్లర్లకు చేర్చాలి. ఇ-క్రాప్‌, భూమిపత్రాలు, ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌, వగైరా వగైరా కచ్చితంగా స్పష్టంగా ఉంటేనే ఆర్‌బికెలలో నమోదు సాఫీగా జరుగుతుంది. లేకపోతే అక్కడే బ్రేక్‌ పడుతుంది. కౌలు రైతులకు ఎలాగూ రికార్డులు ఉండవు కనుక వారికి ఆర్‌బికెలలో నో ఎంట్రీ. ఆర్‌బికె సిబ్బంది కౌలు రైతులను తమ వ్యక్తిగత పూచీకత్తుపై గుర్తించాలి. అదీ కాదంటే భూమి యజమానుల బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు పడతాయి. తమ డబ్బు కోసం యజమానులను బతిమాలాలి. ఈ ఇక్కట్లు భరించలేకే కౌల్దార్లు బేరగాళ్లకు అయినకాడికి ధాన్యాన్ని తెగనమ్ముకొంటున్నారు. ఫలితంగా నష్టపోతున్నారు.
    రెండేళ్లుగా సర్కారీ కొనుగోలు కేంద్రాలంటే రైతులు భయపడిపోతున్నారు. ధాన్యం ఇచ్చాక 21 రోజుల్లో రైతుల భ్యాంక్‌ అకౌంట్లలో రొక్కం పడుతుందనే హామీ ఎక్కువ సందర్భాల్లో ఆచరణకు నోచుకోవట్లేదు. ముందటేడు, నిరుడు కోవిడ్‌ ఫస్ట్‌, సెకెండ్‌ వేవ్‌ కారణంగా రబీ పంటకు మార్కెట్‌ సదుపాయాలు పూర్తిగా స్తంభించాయి. రైతులు ప్రభుత్వానికి ధాన్యం ఇస్తే నెలల పర్యంతం డబ్బు చెల్లించలేదు. బకాయిల కోసం రైతులు రోడ్డెక్కాల్సి వచ్చింది. ప్రభుత్వం ఈ అనుభవాల నుండైనా గుణపాఠాలు తీసుకోలేదని ప్రస్తుత ఖరీఫ్‌ సేకరణను చూస్తే తెలుస్తుంది. ఐదు వారాల క్రితం దాదాపు 12-13 లక్షల టన్నులిచ్చిన రెండు లక్షల మంది రైతులకు రూ.2,500 కోట్లు చెల్లించాలి. సివిల్‌ సప్లయిస్‌కు ప్రభుత్వం డబ్బులివ్వకుండా నిధులు సమకూర్చుకోమనడంతో బ్యాంక్‌ రుణాలు సకాలంలో అందలేదు. దాంతో ధాన్యం సేకరణను తగ్గించారు. నిరుడు ఈ సమయానికి 40 లక్షల టన్నులు సేకరించగా, ఈ ఏట 36 లక్షల టన్నులే సేకరించారు. రూ.3 వేల కోట్ల రాష్ట్ర ధరల స్థిరీకరణ నిధి, కేంద్రానికి చెందిన సెంట్రల్‌ మార్కెట్‌ ఫండ్‌, ఆహార భద్రతా చట్టం నిధులు ఏమై పోతున్నాయో తెలీదు. రాష్ట్రం నుండి ఎఫ్‌సిఐకి బియ్యం సేకరించి పెట్టగా, ఆ నిధులు వేల కోట్లు ఇవ్వకుండా కేంద్రం బకాయి పెట్టింది. కేంద్రం నుండి బకాయిలను రాబట్టడంలో ఎపి సర్కారు గట్టిగా ఒత్తిడి చేయడం లేదు.
క్వింటాలు ధాన్యం పండించడానికి రైతుకయ్యే ఖర్చు రూ.2 వేలు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల మేరకు రైతుకయ్యే వ్యయానికి 50 శాతం కలిపి ఎంఎస్‌పి లెక్కిస్తే రూ.3 వేలు అవుతుంది. కేంద్రం ఇచ్చింది రూ.1,960. మునుపటేడాది కంటే పెంచింది రూ.72 మాత్రమే. ఇదే సమయంలో కాంప్లెక్స్‌ ఎరువులు బస్తాకు రూ. రెండు మూడొందలు పెరిగాయి. డీజిల్‌, పెట్రోలు ధరల మోతతో అన్ని ఖర్చులూ తడిసి మోపెడయ్యాయి. ఇన్ని వ్యయ ప్రయాసలకోర్చి పంట పండిస్తే రైతుకు గిట్టుబాటు సంగతేమో గాని, పెట్టుబడి సైతం రావట్లేదు. అన్ని తరుగులూ, రవాణా ఛార్జీలు, అమాంబాపతు కమీషన్లూ పోను క్వింటాలుకు రూ.1600-1,700 రావడం గగనమవుతోంది. దళారులు, వ్యాపారులకు అమ్ముకుంటే నష్టం చెప్పనలవి కాదు. విపత్తుల వలన పంట దెబ్బ తింటే అదీ రాదు. నవంబర్‌ వర్షాలకు ఐదు లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. ఐదారు లక్షల టన్నుల ఉత్పత్తి నష్టం జరిగింది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభానికి కోవిడ్‌ విలయం తోడై రైతు బతుకు ఛిద్రమైంది. క్లిష్ట సమయంలో రైతుకు ప్రభుత్వ దన్ను అత్యావశ్యం. ఆహార పంటలను సేకరించలేకపోతే రైతులతో పాటు ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది. రైతు రక్షణ, ప్రజల ఆహార భద్రత ప్రభుత్వ కనీస బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చకుంటే ఎన్ని గొప్పలు చెప్పుకున్నా నిష్ప్రయోజనం.