ఒకప్పుడు వరి రైతు అందరు రైతుల్లో రారాజు. ఇప్పుడా రారాజు ఎందుకూ కొరగాని స్థితికి నెట్టివేయబడ్డాడు. గతంలో ఆహార ధాన్యాల్లో వరి ధాన్యం పండించిన రైతుకు కనీసంగానైనా ధర గ్యారంటీ ఉండేది. ఇప్పుడటువంటి అనవాళ్లు మచ్చుకూ కనిపించవు. వడ్లు పండించిన రైతుకు కనీస భరోసా లేదనడానికి రైతులు ప్రస్తుతం పడుతున్న అష్ట కష్టాలే సజీవ సాక్ష్యాలు. నిరుడు కరోనా రెండవ దశ ఉధృతి సమయంలో ఖరీఫ్ మొదలైంది. తుపాన్లు, అధిక వర్షాలు, వరదలు, వర్షాభావం, వంటి ప్రకృతి విపత్తులను, డీజిల్ ధరల ప్రభావంతో అమాంతం పెరిగిన పెట్టుబడులు, ఆనక కరోనా ఆంక్షలు వీటన్నింటినీ ఎలాగొలా దాటుకొని చేతికొచ్చిన కాసిన్ని ధాన్యాన్ని కొనే నాథుడే లేడు. వరి కోతలు ముగింపు దశకొచ్చినా వడ్లు కొనడానికి ప్రభుత్వానికి చేతులు రావడంలేదు. ప్రతి గింజనూ కనీస మద్దతు ధరకు కొని తీరతామన్న హామీలు ఉత్తి ప్రగల్భాలేనని తేలిపోయింది. రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో కొనుగోళ్లని చెప్పగా అదెక్కడా కానరావడంలేదు. నిల్వ సామర్ధ్యం, కనీస మౌలిక వసతులు, కనీసం గోనె సంచులు కూడా సమకూర్చకుండా ధాన్యం కొంటామనడం రైతులను మభ్య పెట్టడం తప్ప మరేమీ కాదు.
ఖరీఫ్‌లో దాదాపు 39 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఉత్పత్తిలో 50 లక్షల టన్నులను సివిల్ సప్లయిస్, మార్క్‌ఫెడ్ ద్వారా కొంటామంది. ఉత్పత్తిలో ప్రభుత్వం కొనేది 60 శాతమే. ఇ-క్రాప్, ఇ-కెవైసి, ముందస్తు రిజిస్ట్రేషన్ వంటి మెలికలు, మడత పేచీలు సరేసరి. ఈ తడవ మిల్లర్లు ఉండరన్నారు. ఆచరణలో జరుగుతున్నదేమిటి? రైతులు మిల్లర్లకే ధాన్యం తోలాలి. మిల్లర్లు ఊరుకుంటారా? తమకిష్టమొచ్చిన రీతిలో రైతులను దోచుకుంటున్నారు. క్వింటాలుకు ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్‌పి రూ.1,950. అంతకంటే తక్కువకు కొనకూడదు. రైత్వారీగా 77 కిలోల బస్తాల్లో తూకాలు వేస్తారు. రైతుకు రూ.1,500 రావాలి. దక్కుతున్నది రూ.1,200. సంచుల బరువు, వేబ్రిడ్జి కమీషన్, అదనపు తూకాల దోపిడీలు అదనం. ఈ మారు అధిక వర్షాలకు 6 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. ఆ మేరకు ఉత్పత్తి నష్టం ఉంటుంది. వర్షాలకు చాలా చోట్ల ధాన్యం తడిచి రంగు మారింది. తేమ శాతం ఎక్కువుంది. ఇటువంటి ధాన్యాన్ని అసలు కొనట్లేదు. కొన్నా రూ.800-1,000 కూడా పడట్లేదు. ఈ తతంగమంతా స్వంత భూమి కలిగిన వారిది. కౌలు రైతులకు అదీ లేదు. కౌల్దార్లకు గుర్తింపే గగనమైంది. దాంతో ఆర్‌బికెల దరిదాపుల్లోకి వెళ్లే ఆస్కారం లేదు. వ్యాపారులకు అందినకాడికి తెగనమ్ముకొని దారుణంగా నష్టపోతున్నారు.
వరి రైతుకు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి అవుతోంది. అదే కౌలు రైతుకైతే రూ.40 వేలు. ఆరుగాలం కష్టించి సేద్యం చేసిన రైతులకు అప్పులే మిగులుతున్నాయి. వరి రైతుల్లో 80 శాతం కౌలు రైతులే కనుక అధికంగా సమిధలవుతున్నది వారే. ఎక్కువ ఆత్మహత్యలూ వారివే. నిరుడు రబీలో వరి రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కొన్న ధాన్యానికి 21 రోజుల్లో ఇవ్వాల్సిన పైకాన్ని నెలల తరబడి ప్రభుత్వమే బకాయి పెట్టడం అన్యాయమైన విషయం. పెట్టుబడులు పెరగడం, సంస్థాగత రుణాలు దొరక్కపోవడం, ధర గిట్టుబాటు కాకపోవడం వలన వరి సాగును రైతులు తగ్గించారు. నీటి వసతి కలిగిన నెల్లూరు వంటి చోట్లా సేద్యానికి రైతులు నిరాకరించడం సంక్షోభానికి ప్రమాద ఘంటిక. ఈ రబీలో ప్రభుత్వం వరి సాగుపై నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది. బోర్ల కింద, డెల్టా ఏరియాలో ప్రత్యామ్నాయ పంటలే వేయమంటోంది. మరో వైపు కేంద్రం గోదాములు ఖాళీగా లేవన్న వంకతో ఎఫ్‌సిఐ సేకరణను కుదించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు వరికి ఉరి బిగిస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ ధోరణినే కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ, ధాన్యం రైతుకు అన్నదాత పేర్లు అంతరించిపోయే రోజు ఎంతో దూరం ఉండదు.










