ప్రజాశక్తి-నందిగామ
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతుల వద్ద ఉన్న పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చనుమోలు సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నందిగామ సివిల్ సప్లై అధికారి రాంమూర్తి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చనుమోలు సైదులు మాట్లాడుతూ ఎన్టిఆర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు సరిగా జరగటం లేదని అన్నారు. మిల్లర్లుకు ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ అయిపోయిందని, తాము దిగుమతి చేసుకోలేను అంటున్నారని అన్నారు. కొన్ని చోట్ల రైతులు ధాన్యం సంచులలో నింపి 10 రోజులు అవుతున్నా సివిల్ సప్లై వారు లారీలు పంపటం లేదన్నారు. జిల్లాలో రెండు లక్షల 80 వేల టన్నుల ధాన్యంకు ఈ క్రాఫ్ నమోదు అయివుండగా ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 1 లక్షా 24,400 టన్ను లు మాత్రమే ధాన్యం సేకరించటం జరిగిందన్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరణకు మిల్లర్లకు అనుమతి ఇచ్చి, రైతుల వద్ద ఉన్న పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఖాసిం సిఐటియు నాయకులు కటారపు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.










