సంచుల బాధ్యత మిల్లర్లకు అప్పగించడంపై ఆందోళన
మిల్లుల కేటాయింపుపై ఇంకా స్పష్టత ఇవ్వని అధికారులు
15 నుంచి రబీ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు
లారీలు, సంచుల సమస్యపై రైతుల్లో వీడని ఆందోళన
నిడమర్రు మండల ధాన్యం గణపవరం మిల్లులకు కేటాయిస్తేనే మేలు
తేమ, తూకంలో మిల్లర్ల నిరంకుశ వైఖరికి అడ్డుకట్ట వేయాలని చర్చ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
రబీ ధాన్యం కొనుగోలు ఏ ఇబ్బందులూ లేకుండా సాఫీగా సాగేనా అంటూ రైతుల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించేందుకు పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 15 నుంచి రబీ ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ కిందిస్థాయి సిబ్బందికి దిశానిర్ధేశం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల రైతులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. రబీలో రెండు జిల్లాల్లోనూ దాదాపు మూడు లక్షలకుపైగా ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. సాగునీటి కష్టాలను దాటుకుంటూ పంట చివరి దశకు చేరుకుంది. వారం, పది రోజుల్లో రైతులు రబీ మాసూళ్లు ముమ్మరంగా ప్రారంభించనున్నారు. ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు పడ్డ ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ గుబులు చెందుతున్నారు. గడిచిన ఖరీఫ్‌లో మిల్లరు, సహకార సంఘాలతోపాటు వివిధ రకాలుగా రైతులకు సంచులు అందించే ప్రక్రియ నడిచింది. అయినప్పటికీ రైతులకు సక్రమంగా సంచులు అందించలేకపోయారు. దీంతో సంచుల కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రబీలో రైతులకు సంచులు అందించే పూర్తి బాధ్యతను మిల్లర్లకు అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే సంచులు రైతులకు సక్రమంగా అందేనా అనే భయం అందరినీ వెంటాడుతోంది. మిల్లర్లు ఎక్కువగా కమీషన్ వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుంటారని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సంచులు సకాలంలో అందించేందుకు ఇష్టపడరనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. కమీషన్ వ్యాపారులను ధాన్యం కొనుగోలు చేసేవిధంగా ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో మద్దతు ధర దక్కేవిధంగా కూడా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఖరీఫ్‌లో రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో లారీల సమస్య తీవ్రమైంది. రబీలో లారీల సమస్య లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఇప్పటి వరకూ సరైన స్పష్టత ఇవ్వలేదు. దీంతో లారీల పరిస్థితి ఏమిటనే భయం రైతులను వెంటాడుతోంది.
మిల్లర్ల నిరంకుశ వైఖరికి అడ్డుకట్ట పడేనా
ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలులో రైతులను మిల్లర్లు నానా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో రబీలో ధాన్యం కొనుగోలుపైనా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తేమశాతం, తూకం పేరుతో రైతుల నుంచి డబ్బు వసూలు చేసిన పరిస్థితి ఖరీఫ్‌లో పెద్దఎత్తున సాగింది. రైతుభరోసా కేంద్ర అధికారులు తేమశాతం నిర్ధారించిన తర్వాత కూడా తేమ 17 శాతం కంటే ఎక్కువగా ఉందంటూ ధాన్యం రోజుల తరబడి దింపుకోకుండా నిలుపుదల చేయడం, తేమ శాతానికి లెక్కలు కట్టి డబ్బు వసూలు చేయడం జరిగింది. తూకం విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవడంతోపాటు నానా ఇబ్బందులు పడ్డారు. తేమశాతం, తూకం నిర్థారణ విషయంలో కచ్చితమైన చర్యలు తీసుకోవాలని, మిల్లర్ల నిరంకుశ వైఖరిని అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు. తేమ, తూకం నిర్థారణ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. రబీలోనూ ఈసమస్యలు పునరావృతమైతే తీవ్ర ఇబ్బందులు తప్పవని అన్నదాత తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు.
గణపవరంలో మిల్లులు కేటాయిస్తేనే మేలు
నిడమర్రు, గణపవరం మండలాలు రెండూ అంటిపెట్టుకుని ఉంటాయి. గడిచిన ఖరీఫ్‌లో గణపవరం మండలం ఏలూరు జిల్లాలోనే ఉంది. దీంతో నిడమర్రు మండలానికి సంబంధించిన రైతులంతా గణపవరంలోని మిల్లులకే తమ ధాన్యం విక్రయించారు. లారీలు దొరక్కపోతే పక్కనే మిల్లులు ఉండటంతో ట్రాక్టర్లతో తమ ధాన్యాన్ని తరలించారు. ఇప్పుడు గణపవరం మండలం పశ్చిమగోదావరి జిల్లాలోకి చేరింది. జిల్లా మారిందనే కారణంతో నిడమర్రు మండలంలోని రైతులకు గణపవరంలోని మిల్లులు కేటాయించకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడే పరిస్థితి రానుంది. ఇది రైతులపై పెనుభారం పడటంతోపాటు రవాణాపరంగా ఇబ్బందులు రానున్నాయి. జిల్లాల విభజనతో సంబంధం లేకుండా నిడమర్రు మండలంలోని ధాన్యానికి గణపవరంలో మిల్లులు కేటాయిస్తేనే ప్రయోజనం ఉంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిల్లుల కేటాయింపులపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ మండలంలోని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.










