Nov 02,2022 22:29

ఎపి రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యాన ధాన్యం కల్లాల్లో నిరసన
ప్రజాశక్తి - ఉంగుటూరు

           తేమశాతం నిబంధనలు సడలించి పచ్చిధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలను తక్షణం తెరిచి రైతులకు, కౌలు రైతులకు గోనె సంచులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో బాదంపూడి కల్లాల్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. పచ్చి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలంటూ నినాదాలు చేస్తూ కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉంగుటూరు మండలంలో వరి కోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదన్నారు. తుపాన్ల హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ మార్పులతో అయినకాడికి కమిషన్‌ ఏజెంట్లకు అమ్ముకుని అన్నదాతలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 75 కేజీల ధాన్యం బస్తాకు ప్రభుత్వం ప్రకటించిన ధర రూ.1560 కాగా గత నాలుగు రోజుల క్రితం కమిషన్‌ ఏజెంట్లు రూ.1260 కొనుగోలు చేసి నేడు రూ.1150కే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కమిషన్‌ ఏజెంట్లు ధాన్యం కొనుగోలు చేయొద్దని చెప్పడంతో ప్రభుత్వం కొనుగోలు చేయక, కమిషన్‌ ఏజెంట్లు కొనుగోలు చేయక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సామూహిక కల్లాలు లేకపోవడంతో ధాన్యం ఆరబెట్టుకోవడానికి రైతులకు అవకాశం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో తేమశాతం నిబంధనలు సడలించి పచ్చిధాన్యాన్ని కొనుగోలు చేసి కౌలు రైతులను, పేద రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ కె.అప్పారావు, మండల అధ్యక్షులు దుడే కేశవ, కౌలు రైతులు దుక్కా రామకృష్ణ, డి.మురళీ, దాసరి శివ, ముంగర శ్రీనివాస్‌ పాల్గొన్నారు.