Nov 21,2022 21:50

ప్రజాశక్తి - ముదినేపల్లి
          రైతులకు ఇబ్బందులు లేకుండా రైతు పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని జెసి పి.అరుణ్‌బాబు అన్నారు. మండలంలోని వడాలిలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి ఆర్‌బికె, రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. రైతుల నుంచి ఆర్‌బికెెల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైసుమిల్లులకు వెంటనే తరలించాలని సిబ్బందికి అదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలు ద్వారా కొనుగోలు చేసి రైసు మిల్లులకు తరలిస్తున్నారన్నారు. కల్లాల్లో ధాన్యం లేకుండా ఎప్పటికప్పుడు ఆర్‌బికెలకు తరలించాలన్నారు. శీతాకాలం కావడంతో తేమశాతం ఎక్కువగా ఉంటున్న దృష్ట్యా 20 తేమ శాతంపైగా ఉన్న ధాన్యాన్ని కూడ రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. తుపాన్‌ ప్రభావం వల్ల రైతులు కూడ పంటను సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేసుకోవాలన్నారు. జిల్లాలో 3.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో ఉంగులూరు, దెందులూరు మండలాల్లో వరికోతలు పూర్తయ్యి మాసూళ్లు చేపట్టి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆర్‌బికెల్లో ఆన్‌లైన్‌లో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్న కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ఆప్‌లైన్‌లో కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు ధాన్యం విక్రయించిన రైతుల్లో కొంతమందికి నగదు వారి ఖాతలో జమ చేశామని చెప్పారు. వాతావరణం దృష్ట్యా రైతులు ఆందోళన చెందకుండా తమ ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నారు. ఆయన వెంట ద్వామా పీడీ రాంబాబు, తహశీల్దార్‌ కె.శ్రీనివాస్‌, ఆర్‌ఐ కెవి.వెంకటేశ్వరావు, మండల వ్యవసాయాధికారి బొర్రా మాధవ్‌, పంచాయతీ కార్యదర్శి జి.రమేష్‌, విఆర్‌ఒ కారే కేశవ, మరీదు బాలదాస్‌ ఉన్నారు.
ఉంగుటూరు:ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతుందని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏలూరు ఆర్‌డిఒ, ధాన్యం సేకరణ మండలం ప్రత్యేకాధికారి కె.పెంచల కిషోర్‌ స్పష్టం చేశారు. సోమవారం ఉంగుటూరు, ఎ.గోకవరంలో ఆర్‌డిఒ పెంచల కిషోర్‌ పర్యటించి ధాన్యం సేకరణ, రవాణా అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఆదివారం వరకూ 10,088 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సోమవారం వంద లారీల ద్వారా సుమారు 2,500 టన్నుల ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించామని చెప్పారు.
మండవల్లి:రైతుల ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జెసి అరుణ్‌ బాబు అన్నారు. మండలంలోని కానుకొల్లు కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. అల్లినగరంలో రైతులు ఆందోళన చేపట్టిన విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలన్నారు. వాతావరణ మార్పుల దృష్ట్యా తేమశాతం 17 కన్నా అధికంగా ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని సిబ్బందికి సూచించారు. 17 శాతం కన్నా ఎక్కువ ఉంటే క్వింటాల్‌కు కేజీ చొప్పున తగ్గించి కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.
గణపవరం:మండలంలో ఇప్పటి వరకూ 1300 మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని సేకరించినట్లు జెడ్‌పి సిఇఒ, మండల కొనుగోలు కేంద్రాల ప్రత్యేక అధికారి కె.రవికుమార్‌ తెలిపారు. మండలంలోని పలుగ్రామాల్లో రైతులను సోమవారం కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకూ ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో 1300 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించినట్లు చెప్పారు. సంచులు కొరత లేదన్నారు. ఆర్‌బికెల వద్ద 74,200 సంచులున్నట్లు చెప్పారు.