ప్రజాశక్తి - భీమడోలు
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు విమర్శించారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం సిఐటియు, కెవిపిఎస్, రైతులు బృందాలుగా ఏర్పడి మండలంలోని సూరప్పగూడెం, గుండుగొలను గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లపై ధాన్యం ఆరపెడుతున్న రైతులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం సేకరిస్తామన్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోలేదన్నారు. మండలం నుంచి సుమారు 45 వేల నుంచి 50 వేల టన్నుల ధాన్యం దిగుబడి రాగా ధాన్యం కొనుగోలు లక్ష్యం 28 వేల టన్నులకు మాత్రమే పరిమితం చేసిందన్నారు. దీనిలో ఇప్పటివరకు నిబంధనల సాకుతో 60 శాతం మేరకు మాత్రమే ధాన్యం కొను గోలు జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిచిన కారణంగా పది శాతం వరకు రైతులు నష్టపోయారని తెలిపారు. తేమ శాతానికి సంబంధం లేకుండా వీరి నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వై.సాల్మన్ రాజు, కెవిపిఎస్ మండల కన్వీనర్ టి.సమన్‌బాబు, రైతులు కెడివి.ప్రసాద్, ఆగేస్‌తో పాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
చాట్రాయి : మండలంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్నదాతలు అవస్థలు పడుతున్నారని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆయన బుధవారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి అక్కడ రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదన్నారు. సంచులు, లారీలు రాకపోవడంతో ఎగుమతి నిలిచిపోయిం దన్నారు. అధికారులు స్పందించి లారీలను పంపించాలని కోరారు.










