Nov 24,2022 21:31

ప్రజాశక్తి - భీమడోలు
        వాతావరణ మార్పుల నేపథ్యంలో ధాన్యం కొనుగోలులో తేమశాతం నిబంధనలు సడలించాలని, రైతుల అవసరాల మేరకు పూర్తిస్థాయిలో గోనెసంచులు అందజేయాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం బృందం గురువారం మండలంలో పర్యటించింది. వాతావరణ మార్పుల కారణంగా రోడ్లపైన, ఖాళీ స్థలాల్లో ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులను వారు కలిశారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు రైతులు ధాన్యం రవాణా విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బృందం దష్టికి తెచ్చారు. సుదూర ప్రాంతాల్లోని మిల్లులకు కాక తమకు సమీపంలోని మిల్లుల్లో ధాన్యం అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వాలని, అక్కడికి ధాన్యాన్ని ఎడ్లబండ్లపై తరలించేందుకు అనుమతించాలని కోరారు. దీనివల్ల ధాన్యం రవాణాకు ట్రాక్టర్లు, లారీల కోసం రోజుల తరబడి రైతులు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదని సూచించారు. ఈ మేరకు రైతులకు రవాణాఛార్జీలు, ఎగుమతి, దిగుమతి ఛార్జీలు చెల్లించాలని రైతులు కోరారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎకరాకు 34 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల ఎక్కువ దిగుబడి వచ్చిన రైతులు ఇబ్బందులు పడతారన్నారు. దీనివల్ల దళారులకు ధాన్యం అమ్మి నష్టపోతారన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో తేమశాతంతో నిమిత్తం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి 17శాతం తేమతో సరఫరా చేసినప్పటికీ దాన్ని మరింతగా ఆరబెట్టి తీసుకురావాలని వెనక్కి పంపుతున్నారని తెలిపారు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.