Apr 23,2023 22:18

ప్రజాశక్తి - భీమడోలు
                ధాన్యం కొనుగోలుకు పూళ్లలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ధాన్యం రవాణా కోసం రైతుల అవసరాలకు సరిపోయే విధంగా వాహనాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆగ్రహంవ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. ఏజెన్సీ పరిధిలోని పుంతరోడ్లపై రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం రవాణాకు సరిపోయే విధంగా వాహనాలు ఏర్పాటు చేయకపోవడంతో రెండు రోజుల క్రితం రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు ఇచ్చిన హామీతో రాస్తారోకోను విరమించారు. కానీ ఆదివారానికి సైతం అధికారులు ఇచ్చిన హామీ అమలుకాకపోవడంతో రైతులు మరోసారి రోడ్లపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఎపి. రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి సిపిఎం తరపున జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.లింగరాజు మద్దతు తెలిపారు. ఈ నిరసనలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు బస్తాల్లో సిద్ధం చేశారన్నారు. ధాన్యం తరలింపునకు రవాణా సమస్యల ఏర్పడటంతో ధాన్యం రైతుల వద్దే ఉండిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను ఏర్పాటు చేయాలని కోరారు. నూక శాతం పేరుతో డబ్బులు వసూలు చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు ఎకరాకు 110 నాణ్యమైన గోనె సంచులను అందజేయాలని ఆయన కోరారు. నూక శాతం పేర బస్తాకు రూ.80 నుంచి రూ.120 వరకూ వసూలు చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు, ఎపి కౌలు రైతుల సంఘ జిల్లా సమన్వయకర్త, సహాయ సమన్వయకర్త కొర్ని అప్పారావు, వెజ్జు శ్రీరామచంద్రమూర్తితో పాటు అధిక సంఖ్యలో రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.
సరిపడా లారీలు, గోనె సంచులు ఏర్పాటు చేయాలి
       ఉంగుటూరు : రైతులకు, కౌలు రైతులకు ధాన్యం పట్టుబడులకు సరిపడా గోనె సంచులు ఇవ్వాలని, రవాణాకు లారీలు ఏర్పాటు చేయాలని ఎపి రైతు సంఘం, ఎపి కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఉంగుటూరు మండలంలోని కైకరంలో రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు పర్యటించి కల్లాల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌.లింగరాజు, కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ కొర్ని అప్పారావు మాట్లాడారు. రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరవడం వల్ల అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన గోనెసంచులు, రవాణా, హమాలీలు వంటి సమస్యలను ముందస్తుగా పరిష్కరించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు.
ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల అకాల వర్షాలకు అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టార్ఫాలిన్లు సబ్సిడీపై అందించకపోవడం వల్ల వర్షం బారి నుండి ధాన్యాన్ని రక్షించుకునేందుకు టార్ఫాలిన్లు అందుబాటులో లేవన్నారు. ప్రభుత్వం స్పందించి రవాణాకు లారీలు ఏర్పాటు చేసి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రైతులకు నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్‌రావు, కౌలు రైతుల సంఘం జిల్లా కో కన్వీనర్‌ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, పలువురు కౌలు రైతులు, రైతులు పాల్గొన్నారు.