Dec 02,2022 22:42

గోనె సంచుల కొరతపై కౌలు రైతుల నిరసన
తేమ శాతం పేరుతో ఇబ్బందులు దారుణం
ప్రజాశక్తి - ఉంగుటూరు

              ధాన్యం కొనుగోలులో ఆలస్యం వల్ల కల్లాల్లోను, ఇళ్ల వద్ద ధాన్యం ఉండిపోయి ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో కైకరంలోని రైతుభరోసా కేంద్రం ఎదుట శుక్రవారం రైతులు, కౌలు రైతులు మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో ధర్నా చేపట్టారు. తేమ శాతం నిర్థారణ, గోనెసంచుల కోసం కాళ్లకు చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, కౌలురైతు సంఘం జిల్లా కన్వీనర్‌ కె.అప్పారావు మాట్లాడుతూ కైకరం ఆయకట్టులో మూడు వేల ఎకరాల్లో వరి సాగు చేయగా ఇప్పటి వరకు 90 శాతం వరి కోతలు పూర్తయ్యాయన్నారు. 700 ఎకరాలకు సంబంధించిన ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా మిగిలిన ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయిందన్నారు. గోనె సంచులు అందుబాటులో లేవన్నారు. గోనెసంచుల కొరత లేదని అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదన్నారు. గోనె సంచులు వెంటనే అందించాలని కోరారు. బస్తాల్లోకి ఎక్కించిన ధాన్యాన్ని లారీల సమస్యతో తీసుకెళ్లకపోవడం వల్ల ఎక్కడికక్కడే ధాన్యం నిల్వ ఉండిపోయిందన్నారు. ఆర్‌బికెల్లో 17 శాతం తేమ వచ్చిన ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి తరుగు పేరుతో రైతులు డబ్బు చెల్లించాలని కోరడం దారుణమని విమర్శించారు. తేమ శాతం, తరుగుకు సంబంధించి డబ్బు చెల్లించకపోతే ధాన్యం అన్‌లోడ్‌ చేసుకోవడం లేదన్నారు. ఆర్‌బికెల్లోనే తేమ శాతాన్ని ఫైనల్‌ చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సంఘాల నాయకులు ఆర్‌బికె అధికారులను కలిసి ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొంతి శ్రీనివాస్‌, తుంపాల అర్జున, కె.అప్పలనాయుడు, సిద్దాబత్తుల వెంకటస్వామి, శానం పాండు రంగారావు, సంపత వెంకన్న, రాగోలు నాగేశ్వరరావు, సనపల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.