Dec 10,2022 23:00

తేమశాతం పేరుతో ధాన్యం తిరస్కరణ
బతిమిలాడినా కనికరించని రైస్‌ మిల్లర్‌
ముదినేపల్లిలో పరిస్థితి దారుణం
చేసేది లేక రోడెక్కిన కౌలురైతులు
రహదారిపై రాస్తారోకో
నిలిచిన ట్రాఫిక్‌
ప్రజాశక్తి - ముదినేపల్లి

               ఓ వైపు మాండూస్‌ తుపాను హెచ్చరికలు.. మరోవైపు చుట్టూ కారుమబ్బులు.. ఈ క్రమంలో మాసూళ్లు పూర్తయ్యి ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్న రైతులకు చేదు అనుభవాలు ఎదరవుతున్నాయి. మిల్లర్లు, ఆర్‌బికె సిబ్బంది రకరకాల కారణాలు చూపుతూ ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. తేమశాతం పేరుతో ధాన్యం వెనక్కి పంపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఓ రైతుకు సంబంధించిన ధాన్యం తేమశాతం పేరుతో కొనుగోలు చేయబోమంటూ వెనక్కి పంపడంతో ఓ రైతు చేసేది లేక ఆ ధాన్యంతో రోడ్డుపై రాస్తారోకోకు దిగాడు. ముదినేపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కౌలురైతు దాడే ఆంజనేయులు తన ధాన్యాన్ని ముదినేపల్లిలోని ఆర్‌బికెలో తంతు ముగించుకుని శనివారం పెయ్యేరులోని శ్రీరామా రైస్‌మిల్లుకు ధాన్యం తీసుకెళ్లారు. అక్కడి రైస్‌మిల్‌ యజమాని ధాన్యాన్ని పరిశీలించి 'ధాన్యంలో రెండు రకాల విత్తనాలుయి. అంతేకాక తేమశాతం అధికంగా ఉంది. మా దగ్గర డ్రై మిషన్‌ లేదు. అరబెట్టేందుకు స్థలం లేదు. మా గుమస్తాతో ఎక్కడికన్నా రాయించుకో. లేకుంటే మీ ఇంటి దగ్గర అరబెట్టుకో. లేకపోతే కాల్వలో పారేసుకో. మీ ధాన్యం కొని మేము నష్టపోవాలా..?' అంటూ ఆ కౌలురైతుకు దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో ఆంజనేయులు వాతావరణం బాగోలేదని, ధాన్నాన్ని దింపుకోవాలని ఎంత బతిమిలాడినా రైస్‌మిల్లు నిర్వాహకులు ససేమిరా అంటూ ధాన్యం కొనే ప్రసక్తేలేదంటూ భీష్మించాడు. దీంతో కౌలు రైతు రెవెన్యూ, ఆర్‌బికె అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో చేసేదిలేక ధాన్యం ట్రాక్టర్‌ను ముదినేపల్లి - బంటుమిల్లి రోడ్డుపై అడ్డంగా పెట్టి కౌలు రైతులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా కూర్చుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నాడు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే రోడ్డులో సింగరాయపాలెంలో షష్టి ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం మహా అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. అదేసమయంలో రోడ్డుపై రాస్తారోకో రైతులు చేపట్టడంతో భారీగా వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలుసుకున్న ఆర్‌ఐ కె.వెంకటేశ్వర రావు సంఘటన స్థలానికి చెరుకుని రైతుల నుంచి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఆర్‌ఐ రైస్‌ మిల్లు నిర్వాహకునితో, రైతులతో చర్చించారు. అనంతరం తహశీల్దార్‌ రైస్‌మిల్‌ యజమానితో ఫోన్‌లో మాట్లాడడంతో ఎట్టకేలకు రైస్‌మిల్లు నిర్వాహకుడు ధాన్యం తీసుకునేందుకు అంగీకరించాడు. ఎస్‌ఐ షణ్ముఖసాయి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం రైతులతో, రైస్‌మిల్లు యాజమానితో చర్చించారు.
రైస్‌మిల్లర్లు నిలువునా దోచేస్తున్నారు : రైతులు
రైస్‌ మిల్లర్లు తమను నిలువునా దోచుకుంటున్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రజాశక్తితో మాట్లాడుతూ ఒకపక్క ప్రభుత్వం కొత్త విధానంతో రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతుండగా మరోపక్క రైస్‌మిల్లర్లు తేమశాతం పేరుతో రైతులను నిలువు దోపీడి చేస్తున్నారన్నారు. తేమశాతం 17కు పైగా ఉందంటూ ఎక్కువ ఉన్నా తేమ శాతానికి డబ్బులు ముందస్తు కడితేనే ధాన్యం కొనుగోలు చేస్తామంటూ రైతులను ఇబ్బందులను పెడుతూ దోచుకుంటున్నారని రైతు గండేపూడి నాగేశ్వరరావు అన్నారు. ఆర్‌బికెలో 19 తేమ శాతం వస్తే, రైస్‌మిల్లు దగ్గర 24 తేమ శాతం ఉందంటూ రైస్‌మిల్లు నిర్వాహకులు చెబుతున్నారన్నారు. తేమ శాతం రేటు కడితే తమ ధాన్యం తీసుకుంటూమని లేకుంటే ఇంటికి తీసుకుపోవాలంటూ చెబుతున్నారని వాపోయాడు. తన ధాన్యం తేమ శాతానికి రూ.10,600 కట్టాలని చెప్పడంతో, ఆ మొత్తం కట్టానని, కానీ డబ్బు కట్టినట్లు తనకు రశీదు కూడా ఇవ్వలేదని వాపోయాడు. అదేవిధంగా మండవల్లి మండలం కానుకొల్లుకు చెందిన మరడాని శ్రీనివాసరావు మాట్లాడుతూ ధాన్యం 11 రోజులు అరబెట్టానని, ఆర్‌బిరెలో 15 తేమ శాతం వచ్చినట్లు చెప్పాడు. ఆర్‌బికె నుంచి ముదినేపల్లి శ్రీరామా రైస్‌మిల్లుకు తీసుకువస్తే తేమ శాతం 21 ఉన్నట్లు రైస్‌మిల్లు నిర్వాహకులు చెబుతున్నారని, చేసేదిలేక వారు చెప్పిన విధంగా రూ.5100 చెల్లించి, ధాన్యం మిల్లు వద్ద దింపినట్లు వివరించాడు. ఈ విధంగా అడ్డగోలుగా రైతుల నుంచి తేమ శాతం అధికంగా ఉందంటూ రైస్‌మిల్లర్లు రైతులను దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని ముఖ్తకంఠంతో కోరుతున్నారు.