
ప్రజాశక్తి - భీమవరం
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా పకడ్బందీగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రశాంతి డివిజన్, మండల స్థాయి అధికారులతో ధాన్యం సేకరణ, రీసర్వే, స్టోన్ ప్లాంటేషన్, ఎలక్షన్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్లకు ఆర్‌బికెలో పూర్తిస్థాయిలో ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే అన్ని ఆర్‌బికెల్లో ధాన్యం కొనుగోలుకు కావాల్సిన మెటీరియల్ అందజేయడం జరిగిందని, అధికారులు సంబంధిత సిబ్బందితో క్షేత్రస్థాయిలో లోటుపాట్లను గుర్తించి సరిచేయాలని అన్నారు. క్షేత్రస్థాయి సమస్యల తక్షణ పరిష్కారం కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌కాల్ చేసి సరి చేసుకోవాలన్నారు. కొనుగోలుకు సంబంధించి తేమ శాతం, టోకెన్స్ జారీ, నాణ్యతా ప్రమాణాలు తదితర వాటిపై సిబ్బందితో ప్రాక్టికల్‌గా చేయించామన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా స్నేహపూరిత వాతావరణంలో అధికారులు, సిబ్బంది పని చేయాలన్నారు. రైతులు పంట కోసే మూడు రోజుల ముందు వారికి కావాల్సిన గోనె సంచులు అందజేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో తగినన్ని గోనె సంచులు నిల్వ ఉంచుకోవాలని, ఎక్కడా గోనె సంచుల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా పని చేయాలన్నారు. ఖరీఫ్ సాగుకు ఎక్కడా నీటి కొరతలేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పలు గ్రామాల్లో రెండు, మూడు దశలలో రీసర్వే అనంతరం జరుగుతున్న స్టోన్ ప్లాంటేషన్ పురోగతిపై ఆరా తీశారు. గృహ నిర్మాణాలకు సంబంధించి లేఅవుట్‌లో ఉన్న ఇబ్బందులను సరి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, డిఎల్‌డిఒ కెసిహెచ్ అప్పారావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జివికె మల్లికార్జునరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి.శివ రామ ప్రసాద్ పాల్గొన్నారు.