జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఈ ఏడాది నవంబర్ నెల నుండి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. మంగళవారం రంపచోడవరం ఐటిడిఎ సమావేశ మందిరంలో అన్ని మండలాలకు సంబంధించిన తహశీల్దార్లు, సివిల్ సప్లై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 56 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీటిలో 44 కొనుగోలు కేంద్రాలు రంప చోడవరం డివిజన్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ఎన్ని గోనె సంచులు అవసరమవుతాయో సివిల్ సప్లై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిసిసి ద్వారా 70 వేల గోను సంచులు ముందుగా తీసుకోవడం జరుగుతుందని డియం సివిల్ సప్లై అధికారి గణేష్ కుమార్ చెప్పారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని అమ్మే విధంగా వారికి సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్, రంపచోవడం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా సర్వే అధికారి మోహన్ రావు, డివిజనల్ సివిల్ సప్లై అధికారి, సి.శ్రీహరి, అన్ని మండలాలకు సంబంధించిన తహశీల్డార్లు పాల్గొన్నారు.










