Nov 17,2022 22:06

కొనుగోలు పరిమితి పెంచాలి.. గోనె సంచులు ఇవ్వాలి
రైతు, కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన
ప్రజాశక్తి - ఉంగుటూరు

               ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని, కొనుగోలు పరిమితి పెంచాలని, రైతులకు గోనె సంచులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. కైకరంలో ధాన్యం కల్లాల వద్ద ఎపి రైతుసంఘం, ఎపి కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. కల్లాల వద్ద నుండే ధాన్యం సేకరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులు రవాణా, హమాలీ ఛార్జీలు ముందుగా భరించి కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకురావాలని చెప్పడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం ఏ రైస్‌ మిల్లుకు వెళ్తుందో ముందు తెలియకపోవడంతో దూరంగా ఉండే మిల్లుకు తరలించే పరిస్థితి ఏర్పడి ట్రాక్టర్ల యజమానులు ధాన్యం రవాణాకు ముందుకు రావడం లేదన్నారు. కల్లాల నుండి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రవాణా, హమాలీల ఏర్పాటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే బాధ్యత తీసుకోవాలని కోరారు. రైతులకు గోనె సంచులు ఇవ్వాలన్నారు. ఎకరాకు 34 బస్తాలే కొనుగోలు చేయాలని కొనుగోలు పరిమితి విధించడం వల్ల ఆ పైన దిగుబడి వచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొనుగోలు పరిమితి 40 బస్తాలకు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ కె.అప్పారావు, రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు, పలువురు రైతులు పాల్గొన్నారు.