Dec 12,2022 22:39

సిపిఎం ఆధ్వర్యాన రైతులు నిరసన
ప్రజాశక్త - పెదపాడు

             రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడులో పర్యటించి, నిరసన కార్యక్రమం చేపట్టారు. రహదారుల నిండా ధాన్యం రాసులున్నాయని, ఎప్పుడు కొనుగోలు చేస్తారంటూ రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఆరబెట్టిన ధాన్యం ప్రస్తుత వర్షానికి తేమ శాతం పెరిగిపోయిందని అన్నదాతలు సిపిఎం నాయకుల వద్ద వాపోయారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ మాండూస్‌ తుపాన్‌ వల్ల కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయి, తేమ శాతం పెరిగి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 17 శాతం వరకూ ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోవడం వల్ల తుపానుకు నష్టాలకు గురికావాల్సి వచ్చిందని చెప్పారు. పెదపాడులో 500 ఎకరాల్లో వరి పండించగా ఇప్పటికి 50 శాతంపైగా వరి కోతలు పూర్తయ్యాయని, ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో కల్లాల్లోనే ధాన్యం ఉండిపోయిందన్నారు. 70 ఎకరాల్లో ధాన్యం అమ్ముడైనా నేటికీ రైతులకు డబ్బులు అందలేదని మండిపడ్డారు. మరో 70 ఎకరాల్లో ధాన్యం కల్లాల్లోనే ఉందన్నారు. వీటిని తడవకుండా రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు పరదాలు కప్పి కాపాడుకుంటున్నారని తెలిపారు. గోనె సంచుల కోసం, ధాన్యం రవాణాకు లారీల కోసం రైతులు కాళ్ల చెప్పులు అరిగేలా కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం కుదించడం వల్ల రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు లక్ష్యం కుదించడం దారుణమని విమర్శించారు. రైతు పండించిన ప్రతి గింజనూ కొంటామని ప్రచారం చేసి ఇప్పుడు లక్ష్యం మేరకే ధాన్యం కొంటామని, మిగిలిన ధాన్యాన్ని ప్రయివేటు వారికి అమ్ముకోవాలని సివిల్‌ సప్లయీస్‌ రాష్ట్ర కమిషనర్‌ ప్రకటించడం ఇదేనా దళారీ వ్యవస్థ నిర్మూలన అని ప్రశ్నించారు. తుపాన్‌ నేపథ్యంలో తేమ శాతం నిబంధన సడలించాలన్నారు. ధాన్యం రవాణాకు లారీలు ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘల ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పి.కిషోర్‌, పి.రామకృష్ణ, ఎస్‌.సత్యనారాయణ, కరీముల్లా పాల్గొన్నారు.