ప్రజాశక్తి- విఆర్.పురం
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలని కోరుతూ సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని పెద్దమటపల్లి గ్రామం వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే కొనసాగించాలని, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ మాట్లాడారు ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేసి ఆపేయడం సరికాదని, ఇంకా రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. గత ఏడాది కొనుగోలు కేంద్రాల వద్ద పని చేసిన హమాలీలకు ఇవ్వాల్సిన చార్జీలను ఇప్పటిదాకా ఇవ్వలేదని, వెంటనే వారికి చార్జీలను చెల్లించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెట్టి లక్ష్మి, రైతు సంఘం, సిపిఎం నాయకులు సోయం చిన్నబాబు, వడ్లది రమేష్, ముసురు వేంకటేశ్వర్లు, కుంజా నాగిరెడ్డి, కల్ము చిన్నయ్య, గుండె పూడి లక్ష్మణరావు, మోసం రాముడు, పెద రామారావు, గుజ్జా శ్రీనివాస్, తుర్రం జోగారావు, తుర్రం వెంకటమ్మ, కుజా బొబ్జి, బీరబోయిన రాజు, రాంబాబు రైతులు పాల్గొన్నారు.










