ప్రజాశక్తి-చింతూరు
అన్ని మండల కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సీపీఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో వరదల్లో నష్టపోయిన బాధితులకు ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.10 వేల నష్ట పరిహారం తక్షణమే ఇవ్వాలని కోరారు. శనివారం సిపిఎం జిల్లా నాయకులు పల్లపు వెంకట్ అధ్యక్షత జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు కొనుగోలు చేయక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరదల్లో నష్టపోయిన బాధితులకు రూ.10 వేలు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి, దానిని అమలు చేయకుండా గోదాట్లో ముంచారని విమర్శించారు. తక్షణమే ముఖ్యమంత్రి హామీని అమలు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కుంజా సీతారామయ్య, మండల కార్యదర్శి సీసం సురేష్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, రంగమ్మ, నాగేష్, సుబ్బారావు, రమేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.










