Nov 19,2023 00:37

సమావేశంలో మాట్లాడుతున్న జెసి శివ శ్రీనివాస్‌

జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌
ప్రజాశక్తి-రంపచోడవరం

ఏజెన్సీలోని గిరిజనులు దళారుల చేతిలో మోసపోకుండా జిల్లాలో ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై శనివారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏడు మండలాలకు సంబంధించిన తహశీల్దార్లు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లతో జెసితో పాటు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రంపచోడవరం డివిజన్‌ పరిధిలోని అడ్డతీగల మండలంలో 3, చింతూరులో 4, దేవిపట్నంలో 4, గంగవరంలో 4, చింతూరు 2, కూనవరంలో 4, మారేడుమిల్లిలో 1, రంపచోడవరంలో 6, రాజవొమ్మంగిలో 6, విఆర్‌.పురంలో 4, వై.రామవరంలో 4, ఎటపాక మండలంలో 5, మొత్తం 46 ధాన్యం కొలుగోలు కేంద్రాలు, పాడేరు డివిజన్లో 24 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతేడాది 28 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు చేయగా, ఈ ఏడాది 30 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిపిఎస్‌ ట్యాగింగ్‌ ద్వారా ధాన్యం మిల్లులకు తరలిస్తామన్నారు. కొలుగోలు కేంద్రాలలో బయోమెట్రిక్‌ ఏర్పాటు చేశామన్నారు.
ఐటీడీఏ పిఒ సూరజ్‌ గనోరే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలపై గిరిజన రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ మాట్లాడుతూ ధాన్యం కొలుగోలు కేంద్రాలను మండల తహశీల్దార్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. రైస్‌ మిల్లర్లు సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్‌ సప్లై మేనేజర్‌ గణేష్‌ కుమార్‌, డీఎస్‌ఓ శ్యాం కుమార్‌, వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు సిహెచ్‌కెవి.చౌదరి, సావిత్రి, తహశీల్దార్లు శ్రీమన్నారాయణ, శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, కె.సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దారు బి.రాజు, మండల వ్యవసాయశాఖ అధికారి లక్ష్మణ్‌, రైస్‌ మిల్లర్లు పాల్గొన్నారు.