Jan 11,2023 23:38

ఐటిడిఎ పిఒకు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి- చింతూరు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసే కార్మికులకు ఐదు సంవత్సరాలుగా చెల్లించాల్సిన కమీషన్‌ డబ్బులు తక్షణమే ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన చింతూరు ఐటిడిఎ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ 2017 నుండి 2021 వరకు వెలుగు ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసిన కార్మికులకు రూ.77 లక్షలు కమీషన్‌ డబ్బులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. కమీషన్‌ చెల్లించాలని ఐదేళ్లగా అడుగుతున్నా అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో అర్ధరాత్రి వరకు కార్మికులు పనిచేశారని, వారి చేత సివిల్‌ సప్లై, వెలుగు అధికారులు వెట్టి చాకిరీ చేయించుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిప్పుతూ వారిని ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకు రావాల్సిన కమిషన్‌ డబ్బులు రూ.77 లక్షలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆందోళన వద్దకు వచ్చిన ఐటీడీఏ పిఒ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. వెలుగు ఎపిడిని నిలదీశారు. పివో వెంటనే స్పందించి సివిల్‌ సప్లై ఎమ్‌డి, కమిషనర్‌తో మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారం కోసం కషి చేస్తానని పిఒ హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, విఆర్‌.పురం ఎంపీపీ కారం లక్ష్మి, కూనవరం వైస్‌ ఎంపీపీ పెంటయ్య, సర్పంచ్‌లు లక్ష్మి, నాగమణి, ఎంపీటీసీ అమ్మాజీ, సిపిఎం నాయకులు వడ్లాది రమేష్‌, పల్లపు పెద్ద రాములు, కార్మికులు రాములమ్మ, లక్ష్మి, ఈశ్వరమ్మ, చుక్కమ్మ, కనకదుర్గ, రాజమ్మ, కనకమ్మ, పెంటమ్మ, జయమ్మ, వెంకటమ్మ, ముత్తమ్మ పాల్గొన్నారు.