Nov 14,2022 23:35

  • మిల్లర్లతో కలెక్టర్‌ డిల్లీరావు

ప్రజాశక్తి - విజయవాడ : జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయని, ఈ నేపథ్యంలో మిల్లర్లు వెంటనే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కోరారు. ధాన్యం కొనుగోళ్లపై జిల్లాలోని రైస్‌ మిల్లర్ల యాజమాన్యాలు, మార్కెటింగ్‌, పౌర సరఫరాల అధికారులతో సోమవారం ఆయన నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో లక్ష 24 వేల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో 17 రైస్‌ మిల్లులను కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సిఎంఆర్‌)గా ధాన్యం సరఫరాకు గుర్తించామన్నారు. గుర్తించిన రైస్‌ మిల్లులు రెండు రోజుల్లోగా బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించిందన్నారు. ధాన్యం తేమ విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు నిర్వహించిన రైతులకు 21 రోజుల్లో నగదు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రైతు కల్లాల నుంచి ధాన్యం వేబ్రిడ్జికి వెళుతుందని, అక్కడ నుంచి ర్యాండమ్‌ పద్ధతిలో కేటాయించిన రైస్‌ మిల్లుకు ధాన్యం చేరేలా పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసే సమయంలో కొంత ధాన్యం నూకగా మారుతోందని, ఈ నష్టాన్ని భర్తీ చేయాలని కోరారు. రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు సమర్పిస్తామన్నారు. రైస్‌ మిల్లర్‌ రంగారావు మాట్లాడుతూ రైతులకు, మిల్లర్లకు నష్టం కలగకుండా తేమ కొలిచే సాధనాలు (మోయిశ్చర్‌ మిషన్‌), వేయింగ్‌ మిషన్లను ర్యాండమ్‌గా తనిఖీ చేయాలని సూచించారు. ఈసమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, పౌర సరఫరాల శాఖ డిఎం శివరామమూర్తి, డిఎస్‌ఒ పి.కోమలిపద్మ, డిప్యూటీ తహశీల్దారు భావనారాయణ పాల్గొన్నారు.