Aug 04,2023 22:38

మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ

- కంచిలి జెడ్‌పిటిసి ప్రతినిధి కృష్ణారావు
- ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడొద్దు
- ధాన్యం కొనుగోళ్లకు ఏం చేశామో తెలుసా?
- జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు ఉన్నా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయమే జరిగిందంటూ కంచిలి జెడ్‌పిటిసి ప్రతినిధి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్ఛాపురం నియోజవర్గ అభివృద్ధిపై జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖపై చేపట్టిన చర్చ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో దళారుల వల్ల రైతులు నష్టపోయారని చెప్పారు. దీనిపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ బదులిస్తూ కొనుగోళ్లు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడటమేమిటని, ప్రజాప్రతినిధిగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయకుండా ఏం చేస్తున్నావని మండిపడ్డారు. తామేమీ ఇంట్లో కూర్చోలేదని, ధాన్యం కొనుగోళ్ల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పదిసార్లు మాట్లాడారని, జిల్లాకు చెందిన మంత్రులూ మాట్లాడారని చెప్పారు. ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడొద్దని, అవే వాస్తవాలని పత్రికలు రాస్తాయని చెప్పారు. గడప గడపకూ మన ప్రభుత్వం కింద కేటాయించిన పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున డిసెంబరులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు.
సచివాలయాలు, ఆర్‌బికెలు తదితర ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలకు ఇసుక సమస్య ఉందని, ఎద్దుల బళ్లతో తీసుకొస్తున్న వారిపై కేసులు పెడుతున్నారంటూ కంచిలికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ప్రస్తావించారు. థర్డ్‌ రీచ్‌ల్లో మాన్యువల్‌ చేసే తవ్వకాలు, రవాణాను ఎవరూ ఆపడానికి లేదని సమావేశంలో నిర్ణయమే ఉత్తర్వులుగా పరిగణించాలని మైన్స్‌, రెవెన్యూ అధికారులకు చెప్పారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి, కంచిలి మండలాల్లోని పలు గ్రామాలకు కొత్త రోడ్ల నిర్మాణం కోసం తవ్వేసి వదిలేశారని, మూడేళ్లవుతున్నా రోడ్లు వేయలేదంటూ ఆయా నియోజకవర్గాల స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సోంపేట మండలం ఇసకలపాలెం నుంచి ఎర్రముక్కాం వరకు ఉన్న తీరంలో మత్స్యకారులకు కోల్డ్‌ స్టోరేజీ నిర్మించాలని చెప్పారు. మండలంలో మత్స్యకార సామాజిక తరగతికి చెందిన 11 మంది ఎంపిటిసిలు, తొమ్మిది మంది సర్పంచ్‌లు ఉన్నా కోల్డ్‌స్టోరేజీ తీసుకురాలేకపోయామని, అవమానంగా ఉందంటూ సోంపేటకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధి వాపోయారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని పలు పిహెచ్‌సిలు, యుహెచ్‌సిల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ మాట్లాడుతూ భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇచ్చినా రావడం లేదని, బలవంతంగా నియమిస్తే సెలవు పెట్టి వెళ్లిపోతున్నారని చెప్పారు. మంత్రి బొత్స జోక్యం చేసుకుంటూ స్థానికంగా ఉన్న వారు ఎవరైనా పనిచేయడానికి ఆసక్తి చూపిస్తే ఉత్తర్వులు ఇస్తామని బదులిచ్చారు.
సంక్షేమ కార్యక్రమాల అమల్లో లోపమే గత ప్రభుత్వ వైఫల్యం
సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజకీయాలకు తావు లేకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూసేందుకే ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తోందన్నారు. తమకు తెలియకుండా లబ్ధిదారుల ఎంపిక చేసేస్తున్నారంటూ నాయకులు, కార్యకర్తలు బాధపడి ఉండొచ్చని, ప్రభుత్వం అమలు చేసిన విధానం వల్ల గౌరవం పెరిగిందని చెప్పారు. అందరూ సమిష్టిగా పనిచేసి ప్రజల అభిమానం పొందేలా చూడాలని సూచించారు. సమావేశంలో జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్సీ నర్తు రామారావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.