రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో రైతుల చేతికి రబీ ధాన్యం వస్తుంది. అత్యధిక భాగం వరి పంట ఈనిక దశను పూర్తి చేసుకుని పాలు పోసుకుని గింజ తయారయ్యే దశకు చేరుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే రబీలో అత్యధిక భాగం రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. ధాన్యం ఉత్పత్తిలో అగ్రభాగం కౌలు రైతులదే. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు నిబంధనలు రైతుల పాలిట శాపాలుగా మారాయి. పంట పండించడం కంటే అమ్ముకోవడానికే రైతు ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. ఖరీఫ్ ధాన్యం అమ్మి నాలుగు నెలలు అవుతున్నా నేటికీ చేతికి డబ్బులు అందక అనేకమంది రైతులు, కౌలు రైతులు రైతు భరోసా కేంద్రాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఉత్పత్తి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. ఎరువులు, పురుగు మందుల ధరలను దారుణంగా పెంచేశారు. రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ట్రాక్టర్ల కిరాయిలు పెంచేశారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర మాత్రం పెరగలేదు. కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలతో రైతుకు భరోసా కల్పించామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. ఆచరణలో మాత్రం అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. కొనుగోలు నిబంధనల పేరుతో మిల్లర్లు, దళారులు రైతును నిలువునా దోచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా రైతుల నుండి గింజ కూడా కొనడం లేదు. కమీషన్ ఏజెంట్లు, మిల్లర్లు కొన్న ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్లుగా చూపిస్తున్నారు. కల్లాల నుండే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని జిల్లాల్లో అధికారులు చెబుతున్నా ఆచరణ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించి అమలు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉత్పత్తి ఖర్చులను తక్కువ చూపి మద్దతు ధర ప్రకటిస్తున్నది. ఆ ధర రైతు పెట్టిన పెట్టుబడి ఖర్చు కంటే తక్కువగా ఉంటుంది. అయితే ఆ మద్దతు ధర కూడా రైతుకు అందడం లేదు. రబీ ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 75 కేజీల బస్తాకు ఏ గ్రేడ్ కు రూ.1470, సాధారణ రకానికి రూ.1455గా ఉంది. అయితే ఈ ధర కనీసంగా రూ.2 వేలు ఉంటే గానీ రైతుకు పెట్టుబడి ఖర్చులు రావు. పైగా కొనుగోలు నిబంధనలతో నష్టపోతున్నారు. ఎకరాకు కౌలుతో కలుపుకుని పెట్టుబడి రూ.55 వేల నుండి రూ.60 వేల వరకు అవుతున్నది. సరాసరి దిగుబడి మాత్రం 40 బస్తాల వరకు వస్తున్నది. ఈ దిగుబడితో రైతుకు మిగులు లేకపోయినా పెట్టిన పెట్టుబడి ఖర్చులు వస్తున్నాయి. కౌలు రైతుకు గడ్డి కూడా మిగలడం లేదు.
ఈ క్రాప్ నమోదు లోపభూయిష్టం
రైతు ధాన్యం అమ్మాలంటే ఈ క్రాప్ నమోదు తప్పనిసరి. ప్రస్తుతం ఈ-క్రాప్ తో పాటు ఇ.కె.వై.సి కూడా పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ క్రాప్ నమోదులో కౌలు రైతుల పేర్లను నమోదు చేయడం లేదు. పంటలు సాగు చేయని భూ యజమానుల పేర్లనే నమోదు చేస్తున్నారు. ఫలితంగా భూ యజమానుల పేరుతోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు అందడం లేదు. పంట సాగుదారు హక్కు పత్రాలు ఇచ్చినా ఈ క్రాప్ నమోదులో కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంది. ధాన్యం డబ్బులు భూ యజమానుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్నారు. కొద్దిమంది కౌలు రైతులు మాత్రమే తమ పేర్లతో ధాన్యం అమ్ముకోగలుగుతున్నారు. గతంలో రుణ అర్హత కార్డుల ఆధారంగా కౌలు రైతులు తమ పేర్లతోనే ధాన్యం అమ్ముకోగలిగారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత పెనం నుండి పొయ్యిలో పడిన చందంగా కౌలు రైతుల పరిస్థితి తయారైంది. భూ యజమానుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఈ క్రాప్‌లో కౌలు రైతుల పేర్లను నమోదు చేయాలి.
గోనె సంచుల కొరత
రైతులు ధాన్యం విక్రయించాలంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా గోనె సంచులను సరఫరా చేయాల్సి ఉంది. అయితే తగినన్ని గోనెసంచులు అందుబాటులో లేవు. మిల్లర్ల దగ్గరే గోనె సంచులు ఉండడం వలన...వారి నుంచి సంచులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. రైతు భరోసా కేంద్రాలు వద్ద గోనె సంచులు అందుబాటులో ఉంచడం లేదు. మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా వారు చెప్పిన ధరకే ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వమే రైతుకు కల్పిస్తోంది. చినిగిన గోనె సంచులు ఇస్తున్నారు. దాంతో రైతు కష్టపడి పండించిన ధాన్యం నేలపాలు అవుతున్నది.
తేమ శాతం లెక్కింపు, తూకాల్లో మోసాలు
కొనుగోలు నిబంధన ప్రకారం 17 శాతం ధాన్యంలో తేమ ఉండాలి. అత్యధిక భాగం వరి కోతలు మిషన్ల ద్వారా జరుగుతున్నాయి. మిషన్లు కోతలు వలన తేమ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. రైతులు ధాన్యం ఆరబెట్టి తీసుకువెళ్లిన సందర్భాల్లో కొనుగోలు కేంద్రాలలో 17 శాతం తేమ ఉన్నదని నిర్ధారణ చేసిన తర్వాత కూడా...మిల్లర్ల వద్ద అధిక తేమ శాతం ఉన్నట్లు చూపి మద్దతు ధరలో కోతలు పెడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల ప్రమేయం లేదని చెబుతున్నా ఆచరణలో మిల్లర్లు చెప్పిన విధంగానే ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. తేమ శాతం లెక్కింపులో అవకతవకలు అరికట్టాలి. తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. తరుగు పేరుతో క్వింటాల్‌కు 2 నుండి 3 కేజీలు కోత పెడుతున్నారు. రైతులు ఎకరాకు క్వింటా ధాన్యం నష్టపోతున్నారు.
ధాన్యం డబ్బు కోసం ఎదురు చూపులే
ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించి అష్టకష్టాలు పడి అమ్మితే డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. గతంలో ధాన్యం విక్రయించిన 72 గంటల్లో డబ్బులు చెల్లించాలన్న నిబంధన ఉంది. జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ నిబంధనను కాస్త 21 రోజులుగా మార్చారు. 21 రోజులు కాదు కదా! రెండు మూడు నెలలు అవుతున్నా రైతు చేతికి డబ్బు అందడం లేదు. పెట్టుబడి తెచ్చిన అప్పులకు ఒకవైపు వడ్డీలు పెరిగిపోతున్నాయి. తిరిగి పంట వేయాలంటే రైతుకు అప్పులు పుట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా వరి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలతో వరి రైతు మెడకు ఉచ్చు బిగిస్తున్నారు. వరి రైతు తెగించి పోరాడితే గానీ ధాన్యం కొనుగోళ్ల సమస్యలు పరిష్కారం కావు.
(వ్యాసకర్త : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
రాష్ట్ర సహాయ కార్యదర్శి,
సెల్ :94900 98574)
కె. శ్రీనివాస్











