Nov 03,2022 21:44

నిబంధనల పేరుతో రైతులకు తప్పని తిప్పలు
వాతావరణ మార్పులతో అన్నదాత గుండెల్లో గుబులు
తడి, పొడి ధాన్యం కొనుగోలు చేయాలంటున్న రైతులు
ఆరబెట్టే స్థలం లేక అగచాట్లు.. ఖర్చులు తడిసి మోపెడు
17 శాతం తేమ దాటితే కొనుగోలుకు నిరాకరణ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

              ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రెండు జిల్లాల్లోని రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. నిబంధనల పేరుతో ప్రభుత్వం అన్నదాతను ఆపసోపాలకు గురిచేస్తోంది. ఈ ఏడాది ధాన్యం కొనుగోలులో నూతన విధానం తీసుకొచ్చామని చెబుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. రెండు జిల్లాల్లోనూ ఖరీఫ్‌లో 4.50 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. ప్రస్తుతం ఖరీఫ్‌ మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే 20 శాతం వరకూ మాసూళ్లు పూర్తవ్వగా ఏలూరు జిల్లాలోనూ మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉంగుటూరు మండలంలో ఇప్పటికే 1,160 ఎకరాల్లో ఖరీఫ్‌లో కోతలు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఆర్‌బికెల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పశ్చిమలో 296, ఏలూరు జిల్లాలో 283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలు రైతులకు ఇబ్బందిగా మారాయి. దీంతో ధాన్యం విక్రయించేందుకు రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.
తడిపొడి ధాన్యం కొనుగోలు చేయండయ్యా..
పశ్చిమగోదావరి జిల్లాలో డెల్టా ప్రాంతం విస్తరించి ఉంది. ఏలూరు జిల్లాలోనూ కొంతమేర ఉన్న డెల్టా ప్రాంతంలో వరిసాగు ఉంది. రెండు జిల్లాల్లోనూ ప్రస్తుతం ముమ్మరంగా ఖరీఫ్‌ మాసూళ్లు సాగుతున్నాయి. ఒక్కో రైతు ఐదు నుంచి పదెకరాలు వరకూ సాగు చేశారు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు తడి పొడి (కొట్టు, పొట్టు) ధాన్యం విక్రయించడం ఇక్కడి రైతులకు సర్వసాధారణం. ధర బస్తాకు రూ.వంద తగ్గినా తూకంలో ఆ నష్టం సరిపోతుందని రైతులు భావిస్తారు. డెల్టాలో పొలాల వద్ద పెద్దగా ఖాళీ ప్రదేశాలు (కళ్లాలు) ఉండవు. పండిన ధాన్యం అంతా ఆరబెట్టి విక్రయించడం రైతులకు సాధ్యపడే పనికాదు. అంతేకాకుండా ఖర్చుతో కూడుకున్న పని. దీంతో తడి, పొడి ధాన్యం విక్రయించడం ఇక్కడి రైతులకు ఎప్పటి నుంచో సర్వసాధారణం. ఈ విధానం ద్వారా రైతులకు మేలు తప్ప చెడు మాత్రం లేదు. ఈసారి ఆర్‌బికెల ద్వారానే ధాన్యం విక్రయించాలని నిబంధన పెట్టారు. ఆర్‌బికెల్లో 17 శాతానికి మించి తేమ ఉంటే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ధాన్యం ఆరబెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో తడి, పొడి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అలా చేయకపోతే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. పదెకరాలు సాగు చేసిన రైతు ఎకరాకు 35 బస్తాల దిగుబడి లెక్కించినా 350 బస్తాల ధాన్యం ఆరబెట్టడం సవాలుతో కూడుకున్న పనిగా రైతులు చెబుతున్నారు. ఆరబెట్టేందుకు బరకాలు, కూలీలతో కలుపుకుని ఎకరాకు రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేలు వరకూ ఖర్చవుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వాతావరణం బాగా ఉంటే పర్వాలేదని, వర్షాలు పడటంతో ఏం చేయాలో తెలియడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఆరుదల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం ఎంతవరకూ సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకూ ధాన్యం కొనుగోలు ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అదే సమయంలో ధాన్యం విక్రయించిన రోజునే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సొమ్ము వెంటనే జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
తడిపొడి ధాన్యం కొనుగోలు చేస్తే రైతుకు మేలు
ముంగర శ్రీనివాస్‌, బొమ్మిడి, కౌలురైతు
'ఖరీఫ్‌లో ఏడెకరాల్లో వరిసాగు చేశాను. ఇప్పటి వరకూ రెండెకరాలు కోత కోశాం. ప్రతిరోజూ చినుకులు పడుతున్నాయి. ధాన్యం ఆరబెట్టేందుకు కళ్లాలు, బరకాలు లేవు. ధర కొద్దిగా తగ్గినా ఆర్‌బికెల్లోనే తడిపొడి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. వాతావరణం బాగుంటే ఆరబెట్టి విక్రయించడానికి ఇబ్బంది ఉండదు. వాతావరణం బాగోలేనప్పుడు రైతులను ఆదుకునే విధంగా ధాన్యం కొనుగోలు జరిగితే రైతులకు మేలు.