May 19,2023 23:03

ప్రజాశక్తి - చింతలపూడి
            'రోజుల తరబడి కల్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. కొనుగోలుకు అధికారులు ముందుకు రావడం లేదు. సంచులు ఇవ్వడం లేదు. దయచేసి ధాన్యం కొనుగోలు చేయండి మహాప్రభో.' అంటూ మండలంలోని యండపల్లి రైతులు అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ మండలంలోని గ్రామ్ల రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. అదేసమయంలో గ్రామం మీదుగా వెళ్తున్న రాఘవాపురం ఆర్‌బికె ధాన్యంలోడు లారీని రైతులు అడ్డుకున్నారు. అందరిలా తమ ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు. లారీకి అడ్డుగా నిలబడి ఆందోళన చేపట్టారు. 20 రోజుల నుండి తమ ధాన్యం కల్లాల్లోనే ఉందని, గోనె సంచులు ఇవ్వలేదని, లారీలు కూడా రావటం లేదని మండిపడ్డారు. యండపల్లి ఆర్‌బికె చుట్టూ తిరిగిన తమ ధాన్యాన్ని తరలించడానికి లారీలు గానీ, సంచులు గానీ పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారని రైతులు ప్రశ్నించారు. అధికారులు దళారులతో చేతులు కలిపి సోమ్ము చేసుకుంటున్నారని రైతులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సిఎం జగన్‌ చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదన్నారు. చింతలపూడి మండలం యండపల్లి గ్రామానికి ఇప్పటికీ 19 వేల గోనె సంచులు ఇవ్వగా, ఇంకా పది వేల గోనె సంచుల కోరత ఉందని ఆర్‌బికె సిబ్బంది చెబుతున్నారన్నారు. యండపల్లి పంచాయతీ పరిధిలో 1580 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, ఇచ్చిన టార్గెట్‌ 540 మెట్రిక్‌ టన్నులు పూర్తికావడంతో గోనె సంచులు ఇవ్వటం లేదని అవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలని, గోనె సంచుల కొరత లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న అగ్రికల్చర్‌ ఎఒ మీనాకుమారి, సివిల్‌ సప్లయీస్‌ డిటి జరీనా, సర్పంచి యడ్ల మోహన్‌ రైతులతో మాట్లాడి గోనె సంచుల కోరత లేకుండా చేస్తామని, మిగతా ధాన్యం కోనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.