Dec 23,2022 21:55

ప్రజాశక్తి - ముదినేపల్లి
         ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు వరి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తేమశాతం పేరుతో మిల్లర్లు పెడుతున్న ఇబ్బందులతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మండలంలో గత మూడు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖరీప్‌ మాసూళ్లు పూర్తయిన రైతులు తమ ధాన్యాన్ని సంచుల్లోకి నింపి ట్రాక్టర్లలోకి ఎగుమతి చేసినా ఆర్‌బికెల సిబ్బంది పట్టించుకోకపోవడం రైతులను ఆగ్రహానికి గురి చేసింది. ధాన్యపు లోడు ట్రాక్టర్లతో మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు.
అందుబాటులో లేని అధికారులు
తొలుత రైతులు ధాన్యం కొనుగోలు విషయమై మాట్లాడేందుకు ఉదయం 10.30 గంటలకు మండల వ్యవసాయ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికి వ్యవసాయాధికారి బొర్రా వేణుమాధ్‌వ్‌ కార్యాలయానికి రాలేదు. నిరీక్షించినా సదరు అధికారి రాకపోవడంతో తహశీల్దార్‌ను కలిసేందుకు అంతా 11 గంటలకు తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి తహశీల్దార్‌ రాగా రైతులంతా ఆయనను కలిసేందుకు వెళ్లబోగా సిబ్బంది అడ్డుకున్నారు. వాగ్వివాదం అనంతరం లోనికి రైతులను అనుమతించారు.
సాయంత్రంలోగా సమస్య పరిష్కరిస్తాం
తహశీల్దార్‌ కె.శ్రీనివాసరావు
ధాన్యం కొనుగోలు సమస్యపై రైతులు తహశీల్దార్‌తో చర్చించారు. చర్చల అనంతరం రైతులు విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల్లోపు ధాన్యం లోడులు దిగుమతి చేసేలా ఉన్నతాధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని తహశీల్దార్‌ శ్రీనివాసరావు హామీ ఇచ్చారని తెలిపారు. ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారం కాకపోతే శనివారం ఆందోళన చేపడతామని వారు ప్రకటించారు.
'ప్రజాశక్తి'పై తహశీల్దార్‌ రుసరుసలు
రైతులు తమ సమస్యను తహశీల్దార్‌కు వివరించేందుకు ఆయన ఛాంబర్‌లోకి వెళ్లగా సమాచారం తెలిసి వార్తను కవర్‌ చేసేందుకు ప్రజాశక్తి విలేకరి ఆ ఛాంబర్‌లోకి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా తహశీల్దార్‌ శ్రీనివాసరావు 'ఎవరు మీరు, ఎందుకొచ్చారు, ఇక్కడ మీకు పనేంటి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. రైతులు పిలిస్తేనే తాను వార్త కవరేజీకి వచ్చానని, చర్చల వివరాలు తర్వాత తెలపండని విలేకరి బయటకు వచ్చేశారు.
ధాన్యం కొనుగోలు చేయడంలేదు
నాని, రైతు, వడాలి

మూడు రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. బ్యాంక్‌ గ్యారంటీ రైస్‌మిల్లుకు లేదని అధికారులు రైతులతో అంటున్నారు. మూడు రోజులుగా ధాన్యం అన్‌లోడు చేయడం లేదు. వేబిల్లు రావడానికి రెండు రోజులు సమయం పడుతుంది. మిల్లర్‌కు బ్యాంక్‌ గ్యారంటీ లేనప్పుడు రైతులకు ఎందుకు సంచులు ఇస్తున్నారు. సంచులు ఇవ్వకపోతే రైతు ఇంటి వద్దే ధాన్నాన్ని రాశులుగా ఉంటుకుంటారు. ఆర్‌బికె అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు, ట్రాక్టర్‌ డ్రైవర్లు రోజులు తరబడి ధాన్యం దిగుమతి కోసం నిరీక్షించాల్సి వస్తోంంది. ధాన్యం తేమశాతంలో తేడాకు ఒక పాయింట్‌కు రూ.20 చొప్పున మిల్లర్‌కు చెల్లించాల్సి వస్తోంది.
అమ్మకం చాలా తలనొప్పిగా మారింది
రామిరెడ్డి సురేంద్రరెడ్డి, రైతు, వడాలి

ప్రభుత్వం పెట్టిన నిబంధనలు రైతులకు తలనొప్పిగా మారాయి. మిల్లుకు బ్యాంక్‌ గ్యారెంటీ లేక ధాన్యం దిగుమతి చేసుకోలేదు. లోడ్‌ చేసి మూడు రోజులైంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం దిగుమతి చేసుకోవాలి.
నిబంధనలు సడలించాలి
పి.వెంకట్రావు, రైతు, చినపాలపర్రు

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులకు ఇబ్బంది లేకుండా నిబంధనలు సడలించి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి. అసలే శీతాకాలం, దానికితోడు రోజు మబ్బుల కారణంగా ధాన్యం ఆరబెట్టినా తేమశాతం తగ్గడం లేదు. ప్రభుత్వ నిబంధనలు సడలించి తడి, పొడి ధాన్యం కొనుగోలు చేయాలి.
ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదు
జె.ప్రసాద్‌, ట్రాక్టర్‌ డ్రైవర్‌. పెయ్యేరు

మిల్లరు వద్దకు ధాన్యం తీసుకొస్తే రోజులు తరబడి ధాన్యం దిగుమతి చేయడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోజుకు రెండు, మూడు ట్రిప్పులు వేసే వాళ్లం. ధాన్యం దిగుమతి కాకపోవడంతో రెండు రోజులకు ఒక ట్రిప్పు కూడా పడటం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం.
దళారులకే సంచులు
సిహెచ్‌.సురేంద్రప్రసాద్‌, రైతు, చినపాలపర్రు

ఆర్‌బికె అధికారులు దళారులకే సంచులు ఇస్తున్నారు. రైతులకు ఇవ్వడం లేదు. ఆర్‌బికెలో రైతులు సంచుల కోసం రోజులు తరబడి నిరీక్షించాల్సివస్తోంది. శుక్రవారం తహశీల్దార్‌ను కలిశాం. సాయంత్రంలోపు ధాన్యం లోడులు దిగుమతి చేసుకుంటామన్నారు. దిగుమతి చేసుకోకపోతే శనివారం రైతులంతా ముదినేపల్లిలో ఆందోళన చేస్తాం.