ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేస్తామని పాలకులు, అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో అమలుకు అసలు పొంతనే ఉండట్లేదు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఆరుగాలం కష్టించి పంటలు సాగు చేస్తున్న
అన్నదాతలకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని సేకరించాల్సి ఉన్నా లక్ష్యాన్ని కుదించడంతో చివరకు దళారులకు అమ్ముకోవాల్సి పరిస్థితి వస్తోంది.
కాకినాడ జిల్లాలో ఈ ఏడాది 2.30 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. సుమారు 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని మొదట్లో అంచనా వేశారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మెట్టలో పలువురు రైతులు పంటలను నష్టపోయారు. దాంతో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు తాజాగా అంచనా వేస్తున్నారు.
దళారులకు అమ్ముకోక తప్పదా.?
ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అనేక నిబంధనలను విధిస్తుంది. ప్రధానంగా తేమ శాతం నిబంధనతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. దానికి తోడు ఈ ఏడాది నుంచి భూమి గల రైతు బయోమెట్రిక్ ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామనే నిబంధన తప్పనిసరి చేయడంతో కౌలు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం యంత్రాల ద్వారా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గండేపల్లి, సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం, కరప, తాళ్లరేవు, కాజులూరు, కాకినాడ రూరల్ తదితర మండలాల్లో 30 శాతం కోతలు పూర్తయ్యాయి. 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిలో సుమారు 76 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం స్థానిక అవసరాలకు పోగా మిగిలిన 4.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. 3.11 లక్షల ధాన్యాన్ని సేకరిస్తామని అధికారులు గత నెలలో ప్రకటించారు. కానీ సివిల్ సప్లయీస్ అధికారులు మాత్రం 2.60 లక్షల మెట్రిక్ టన్నులకు లక్ష్యాన్ని కుదించింది. దీనిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల నుంచి ఎంత ధాన్యాన్ని అయినా కొనుగోలు చేస్తామని ఓ పక్క మంత్రులు, ఎంఎల్‌ఎలు, జిల్లా అధికారులు చెబుతుండగా ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్పత్తి తగ్గుతుందనే కారణంతో సేకరణ లక్ష్యాన్ని కుదించడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సిందేనా అంటూ నిట్టూర్చుతున్నారు. పెరిగిన ఎరువులు, పురుగుమందుల ధరలు, ఇతర ఖర్చులతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో రైతులు దిగాలు చెందుతున్నారు. అప్పులే మిగిలేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యాన్ని అవసరానికి అనుగుణంగా పెంచుతాం
జిల్లాలో 262 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేలా ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ధాన్యాన్ని కొంటాం. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని అవసరమైతే పెంచుతాం. ఎవరూ దళారులకు అమ్ముకోవద్దు. ఎప్పటికప్పుడు సొమ్ములు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
- డి.పుష్పమణి, డిఎం, సివిల్ సప్లయీస్.