Feb 23,2023 22:30

ప్రజాశక్తి-విజయవాడరూరల్‌: ధాన్యం డబ్బులు సకాలంలో అందక రైతులు అవస్థలు పడుతున్నారని అధికారులపై సభ్యులు ధ్వజమేత్తారు. విజయవాడ రూరల్‌ మండల పరిషత్‌ సమావేశం గురువారం ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి అధ్యక్షతన జరిగింది. మండల వ్యాప్తంగా రూ.10 కోట్లు మేర ధాన్యం డబ్బులు రావాల్సిన పరిస్థితి ఉందని ప్రసాదంపాడు పిఎసిఎస్‌. చైర్మన్‌ సాదం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సకాలంలో డబ్బులు రాక రబీ సాగుకు రైతులు మరింతగా అప్పులు చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు సివిల్‌ సప్లై శాఖ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు సమావేశంలో వినతి పత్రం అందజేశారు. అదే విధంగా ధాన్యం ఆన్లైన్‌ చేయడం లేదని, దానివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆన్లైన్‌ చేయాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. రైతులు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ రావడంలేదని ఎంపిటిసి పత్తిపాటి రవీంద్ర (నాని) అన్నారు. వెంటనే రైతులకు వడ్డీ రాయితీని చెల్లించాలని కోరారు. పలు అంశాలపై వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డి, జడ్‌పిటిసి సువర్ణ రాజు, తహసీల్దార్‌ జాహ్నవి, ఎంపిడిఒ భార్గవి, ఎఒ రంగనాధ్‌బాబు, ఇఒఆర్‌డి శేషగిరిరావు తదితరులు మాట్లాడారు.