Jan 05,2023 22:47

ఇప్పటికీ వీడని కొనుగోలు సమస్యలు
బ్యాంకు గ్యారెంటీ సమస్యతో రైతులకు ముప్పుతిప్పలు
రోడ్డెక్కుతున్న రైతులు
తేమశాతంలో తేడా సమస్యపై తీవ్ర ఆగ్రహం
రబీలో ధాన్యం కొనుగోలుపై రైతుల్లో ఇప్పటి నుంచే బెంగ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

               ధాన్యం కొనుగోలు సమస్య అత్యంత ఇబ్బందికరంగా మారింది. ధాన్యం కొనుగోలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ రైతులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆదిలో లారీలు, గోనెసంచులు, యాప్‌ సమస్యతో సతమతమైన రైతులు ఇప్పుడు బ్యాంకు గ్యారెంటీ సమస్యతో నలిగిపోతున్నారు. ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో ఏలూరు జిల్లాలోని రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. రెండు జిల్లాలవ్యాప్తంగా ఖరీఫ్‌లో దాదాపు 4.50 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. పశ్చిమలో 3.42 లక్షలు, ఏలూరు జిల్లాలో 3.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. ఇప్పటి వరకూ రెండొంతుల ధాన్యం కొనుగోలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఏలూరు జిల్లాలో ఇంకా లక్ష టన్నుల వరకూ ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. పశ్చిమలోనూ ఇంకా ధాన్యం కొనుగోలు జరగాల్సి ఉంది. రబీ మాసూళ్లు పూర్తవుతున్నా ఇంకా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. మాసూళ్లు చేసి పది రోజులు గడిస్తే తప్ప ఏఒక్క రైతు నుంచీ ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తేమ శాతం. ఆర్‌బికె సిబ్బంది 17శాతంలోపు తేమ ఉందని నిర్ధారించి ధాన్యం లారీల్లో పంపిన తర్వాత మిల్లుల వద్ద 20 శాతం, ఆపైన తేమ ఉందని ధాన్యం దింపుకునేందుకు మిల్లర్లు ససేమిరా అంటున్నారు. దీంతో రైతులు ఏం చేయాలో తెలీక తేమశాతానికి సంబంధించి సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం జరిగిన జిల్లా పరిషత్‌ సమావేశంలోనూ జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు ఇదే విషయమై ప్రశ్నించగా వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. మిల్లర్లకు, ఆర్‌బికెలకు మధ్య తేమశాతం ఎందుకు తేడా వస్తుందో సరైన సమాధానం చెప్పడం లేదు. తేమశాతం సమస్య రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. బ్యాంకు గ్యారెంటీలు అయిపోయాయంటూ ధాన్యం లోడు చేసిన తర్వాత ఆగిపోవడంతో ఏలూరు మండలం జాలిపూడిలో రైతులు రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీన్నిబట్టి ఇప్పటికీ ధాన్యం కొనుగోలు ఇబ్బందులతో రైతులు ఏవిధంగా నలిగిపో తున్నారో స్పష్టమవుతోంది. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే సమస్యలు వెంటాడుతున్నట్లు రైతుల్లో చర్చ సాగుతోంది. బ్యాంకు గ్యారెంటీలపై అప్రమత్తత లేకపోవడం కారణంగానే రైతులకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని తెలుస్తోంది.
రబీలో ధాన్యం కొనుగోలుపై ఇప్పటినుంచే బెంగ
ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు చవిచూసిన రైతులు రబీపై ఇప్పటి నుంచే బెంగ పెట్టుకుంటున్నాడు. రబీకి సంబంధించి ఇప్పటికే సగానికిపైగా నాట్లు పూర్తయ్యాయి. సంక్రాంతికి పూర్తిస్థాయిలో రబీ నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌ నుంచి రబీ మాసూళ్లు ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఖరీఫ్‌ మాదిరిగా ఇబ్బందులు ఉంటే పరిస్థితి ఏమిటనే భయం అన్నదాతను వెంటాడుతోంది. రబీలోనైనా ధాన్యం కొనుగోలు సమస్య లేకుండా చేయగలరా అనే చర్చ రైతుల్లో నడుస్తోంది. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులతో వరిసాగుపై రైతుల్లో విరక్తి నెలకొంది. రబీ ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో ముందుకు సాగకపోతే రైతుల ఆగ్రహం చవిచూడక తప్పదు.