Jan 24,2023 23:05

ప్రజాశక్తి-ఎ.కొండూరు: వ్యవసాయ మార్కెటింగ్‌ యార్డు ద్వారా ధాన్యం కొనుగోలు చేసి రెండున్నర సంవత్సరాలు గడిచిన నేటికీ డబ్బులు చెల్లించకపోవడంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులు మంగళవారం స్థానిక తాహాసిల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ పాత కొండూరు, అట్లప్రగడ గ్రామాలకు చెందిన 14 మంది రైతులు 2021లో మార్కెటింగ్‌ యార్డుకు ధాన్యం విక్రయించారని, ఇప్పటివరకు రైతులకు చెల్లించాల్సిన రూ.11 లక్షలు చెల్లించలేదని అన్నారు. రైతులందరూ ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన కౌలు రైతులని, అప్పులు ఎలా తీర్చాలో తెలియక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. గతంలో వీరి వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసిన తిరువూరు ఏఎంసి సూపర్వైజర్‌ కె.నాగ దుర్గారావు ఇటీవల కొంతకాలంగా రైతులు ఫోన్‌ చేసినా సమాధానం చెప్పడంలేదన్నారు. వచ్చే నెల 2వ తేదీ లోపు ఈ సమస్యను పరిష్కరించకపోతే తిరువూరు భద్రాచలం హైవేపై కుటుంబాల సమేతంగా రైతులను సమీకరించి రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు అనంతరం తాహాసిల్దార్‌ చాట్ల వెంకటేశ్వరరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. డబ్బులు చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మార్కెటింగ్‌ సూపర్వైజర్‌ నాగదుర్గారావుపై ఏ కొండూరు ఎస్సైకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్‌ రామకృష్ణారెడ్డి, కౌలురైతు సంఘం మండల కార్యదర్శి పి.ఆనందరావు, సిఐటియు మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, గిరిజన సంఘం నాయకులు బి.గోపిరాజు, డి.రాముడు, ఎం.కృష్ణప్రసాద్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.