జిల్లా రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిఆర్‌ఒకు రైతు సంఘాల వినతి
ప్రజాశక్తి - ఏలూరు
జిల్లాలోని రైతులకు ధాన్యం బకాయిసొమ్ము వెంటనే చెల్లించాలని, ఆయిల్ పామ్ రైతులకు మొక్కలు అందించాలని రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ నాయకులు కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో డిఆర్‌ఒ మూర్తికి వినతిపత్రం అందజేశారు. రైతాంగ సమస్యలను కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహం వద్ద వినతిపత్రాలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం (స్ఫూర్తి భవనం) జిల్లా కన్వీనర్ రాయంకుల లక్ష్మణరావు, ఎపి రైతుసంఘం (అన్నే భవనం) జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు, బికెఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని కోరారు. కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గోనెసంచులు అందించి రవాణాకు లారీలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. తేమ శాతం లెక్కింపులోనూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆర్‌బికెల వద్ద తేమ శాతం నిర్ధారించి ఆ ప్రకారంగానే రైతుల నుండి ధాన్యం సేకరించాలన్నారు, వే బ్రిడ్జి కాటా వద్దకు మిల్లరు కాటా వద్ద ధాన్యం తూకంలో తేడాలు చూపిస్తున్నారని, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి కాటానే ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. 21 రోజులు దాటినా ధాన్యం డబ్బులు అందడం లేదన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వస్తున్న రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించాలని కోరారు. సంవత్సరాల తరబడి మొక్కల కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తోందని, అధిక రేట్లు పెట్టి కొనాల్సి వస్తోందన్నారు. దొండ పందిళ్లు, ఉద్యాన పంటలకు ఇవ్వాల్సిన సబ్సిడీ బకాయిల నిధులు విడుదల చేసి రైతులకు అందించాలన్నారు. మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు, పశు బీమా పరిహారం నిధులు విడుదల చేసి పాడి రైతులకు అందించి ఆదుకోవాలని కోరారు. టార్పాలిన్లు, పురుగుమందుల స్ప్రేయర్లు వంటి వ్యవసాయ పరికరాలు కౌలు రైతులకు, పేద రైతులకు సబ్సిడీపై అందించాలన్నారు. రబీ సీజన్‌కు సంబంధించి కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలిచ్చి వడ్డీలేని పంట రుణాలివ్వాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి మెట్ట ప్రాంత భూములకు సాగునీరు అందించాలని కోరారు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతులకు ప్రయివేటు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం పెంచి ఇవ్వాలని, సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించి బీటీ రోడ్లు నిర్మించాలన్నారు. విత్తన మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు కంపెనీల నుండి అగ్రిమెంట్స్ ఇప్పించాలని, విత్తన కంపెనీలు రైతులను మోసగించకుండా చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు ప్రక్రియ నిలుపుదల చేయాలన్నారు. సుబాబుల్, జామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఆక్వా రైతులను ఆదుకోవాలని విద్యుత్ సబ్సిడీ పథకం ఆక్వా రైతులందరికీ ఇవ్వాలని కోరారు.










