Feb 21,2023 22:22

ప్రజాశక్తి - పెదపాడు
         రైతులకు, కౌలురైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో కొత్తూరు రైతుభరోసా కేంద్రం వద్ద మంగళవారం రైతులు, కౌలురైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులు, కౌలురైతులు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం అమ్మి 40 రోజులు గడుస్తున్నా ధాన్యం సొమ్ము చెల్లించకపోవడం అన్యాయమన్నారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టి పంట పండించి అమ్మితే ధాన్యం సొమ్ము చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 9వ తేదీ తర్వాత రైతులకు ధాన్యం సొమ్ము చెల్లించలేదన్నారు. కొత్తూరు ఆర్‌బికె పరిధిలో సుమారు రూ.3 కోట్లు, కొత్తముప్పర్రు ఆర్‌బికె పరిధిలో సుమారు రూ.4 కోట్లు ధాన్యం బకాయిలులి చెల్లించాల్సి ఉందన్నారు. ధాన్యం బకాయి సొమ్ము వడ్డీతో చెల్లించి ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దిబోయిన కాశీవిశ్వనాథం, పల్లపోతు శ్రీనివాసరావు, పల్లపోతు రెడ్డియ్య, కన్నెగంటి పూర్ణచందర్రావు, చెన్నుబోయిన దుర్గారావు, దన్నే నాగేంద్రరావు, శనగల సత్యనారాయణ, కడిమి రాజు, చెడుగొండి సూర్యనారాయణ, కవ్వూరి రాంబాబు పాల్గొన్నారు.