Dec 14,2022 21:50

ఇ క్రాప్‌ నమోదులో తప్పిదాలు
రైతులకు అందని గోనెసంచులు
ప్రజాశక్తి - చింతలపూడి

             జిల్లాలో మెట్టప్రాంతంలో వరిపంట ఎక్కువ సాగు చేసే మండలంలో చింతలపూడి ఒకటి. మండలంలో 16,000 వేల హెక్టర్లలో వరిసాగు చేశారు. ఎకరానికి 30 నుంచి 35 వరకు ధాన్యం బస్తాలు దిగుబడి అవుతుంది. పంట చేతికి వచ్చే సమయానికి గోనే సంచుల సమస్య రైతులను వేధిస్తోంది. ఈ ఏడాది ఆ సమస్యతో పాటు ధాన్యం అమ్మటంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త నిబంధనలు రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చేలా చేస్తున్నాయి. గోనె సంచులు సరఫరా చేయటంలో విఫలం అయ్యారని రైతులు విమర్శలు చేస్తున్నారు.
ఇ - క్రాప్‌ నమోదులో తప్పిదాలు
ప్రభుత్వం రైతు వద్ద పంట కొనుగోలు చేయటానికి ఇ-క్రాప్ట్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉండగా అందులో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఒక పంటకు బదులు మరొక పంటను నమోదు చేయటంతో పంట అమ్ముకునే సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రస్తుతం 433 ఎకరాలు ఇ క్రాప్ట్‌లో తప్పుగా నమోదు అయినట్లు గుర్తించినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
తేమశాతంలో తేడాలు
ఆర్‌బికె కేంద్రాల వద్ద, మిల్లర్ల వద్ద తేమశాతం భిన్నంగా ఉంటుంది. ఒకచోట ఒకలా, మరొకచోట ఒకటా ఎందుకు వస్తుందో రైతులకు అర్థం కాని పరిస్థితి. ఆర్‌బికె కేంద్రాల వద్ద తేమశాతం నిబంధనలకు అనుగుణంగానే ఉందని అధికారులు చెప్పిన తర్వాత తేమశాతంలో తేడాలు ఉన్నాయని మిల్లర్లు ధాన్యం లోడులు నిలిపివేసిన సంఘటనలూ ఉన్నాయి. ఒకే ధాన్యం రెండు చోట్ల వేర్వేరుగా వస్తుంది. దీనిపై అధికారులు దృష్టి సారించి పరిష్కరించలేదు.
రైతులకు అందని గోనెసంచులు
దళారుల వద్ద గోనె సంచులు అందుబాటులో ఉంటున్నాయని, ఆర్‌బికె ద్వారా ధాన్యం అమ్ముకునే రైతులకు మాత్రం గోనెసంచులు దొరకడం లేదని గణిచర్ల గ్రామంలో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోనెసంచుల కోసం ఆర్‌బికెల చుట్టూ తిరుగుతున్నామని వాపోతున్నారు. అయినా గోనెసంచులు సరఫరా చేయడంలేదని, అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
పంట కొనుగోలు చేయండి
శ్రీనివాసరావు, రైతు, సమ్మెటవారిగూడెం
18 ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. ఇ క్రాప్ట్‌ నమోదులో తేడాలు ఉండటంతో నా పంట రొనుగోలు చేయటం లేదు. నా పంట 20 రోజులుగా కల్లాల్లోనే ఉంది. పంటను కొనుగోలు చేసి ఆదుకోండి.