Nov 19,2023 23:41

ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లోకే డబ్బులు

* ఈ-క్రాప్‌లో నమోదైన పంటనంతటినీ తీసుకుంటాం
* 390 చోట్ల కేంద్రాల ఏర్పాటు
* గతేడాది సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు
* జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ శ్రీనివాస్‌
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: 
భూమి ఎవరిదైనా ఆ పొలంలో ఎవరు ధాన్యం పండిస్తే వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బులు జమ అవుతాయని జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. గతంలో భూమి సొంతదారుడి ఖాతాలో డబ్బులు జమ కావడం, అవి తీసి కౌలు రైతుల రైతులకు ఇచ్చే పరిస్థితి ఉండేదని అన్నారు. ఈ సంవత్సరం అలా ఉండదని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు లక్ష్యం అంటూ పెట్టుకోలేదని, రైతు పండించిన పంటనంతటినీ కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఎప్పటిమాదిరిగానే ఈ-క్రాప్‌ లో నమోదైన పంటనే కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శ కాలకనుగుణంగా ధాన్యం తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచిం చారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇస్తేనే మద్దతు ధర దక్కుతుందని చెప్పారు. ధాన్యం కొనుగోలులో గతేడాది తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధాన్యం సేకరణకు పాత నిబంధనలే అమలు చేస్తున్నా... అందులో లోపాలను సవరించి రైతులకు న్యాయం చేస్తామ ని చెప్తున్నారు. ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు, రైతులకు చెల్లింపు వంటి అంశాలపై 'ప్రజాశక్తి' ముఖాముఖిలో వివరించారు.
ధాన్యం కొనుగోలు ఏర్పాట్లను వివరిస్తారా?
జిల్లా వ్యాప్తంగా 390 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. 2 వేలు పైబడి ధాన్యం సేకరించే అవకాశం ఉన్న కేంద్రాలను ఎ కేటగిరిగా, వ్యెయ్యి నుంచి 2 వేలు టన్నుల లోపు వరకు కొనుగోలు చేసేవాటిని బి కేటగిరిగా విభజించారు. అదేవిధంగా వెయ్యి టన్నుల కంటే తక్కువ ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉన్నవాటిని సి కేటగిరిగా నిర్ణయించారు. జిల్లాలో ఎ కేటగిరిలో 182, బి కేటగిరిలో 176, సి కేటగిరిలో 32 కేంద్రాలు ఉన్నాయి. కేంద్రాల్లో ధాన్యం నాణ్యతా ప్రమాణాల పరిశీలన, వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు వంటి అవసరాల కోసం టెక్నికల్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, హెల్పర్‌ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికపై 1170 మందిని నియమించాం.
ఈ ఏడాది ఎంతమేర ధాన్యం మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు?
ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఇందులో 3,50,765 ఎకరాలకు పంటల క్రాపింగ్‌ జరిగింది. 3,34,330 ఎకరాలకు ఈకెవైసి పూర్తయింది. ఈ సంవత్సరం 8.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసి చెప్పారు. అందులో 7,87,447 మెట్రిక్‌ టన్నులు మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నాం. ధాన్యం కొనుగోలుకు లక్ష్యం అంటూ పెట్టుకోలేదు. రైతు పండించిన పంటనంతటినీ కొనుగోలు చేస్తాం.
జిల్లాలో కొంత మంది మిల్లర్లు ఒడిశా ధాన్యం కొంటున్నారన్న ఆరోపణలు చాలా ఏళ్లుగా ఉన్నాయి. దీనిని అధిగమించడానికి ఏం చేయబోతున్నారు.
ఒడిశా ధాన్యం కొనుగోలు చేయకుండా అన్ని రకాల కట్టడి చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం రవాణ చేసే వాహనాలకు ఈ సంవతసరం కొత్త జిపిఎస్‌ పరికరాలను అమర్చుతున్నాం. కళ్లాల నుంచి మిల్లులకు ధాన్యం తీసుకువెళ్లే వాహనాలకు వీటిని పెడుతున్నాం. జిల్లాలో 5 వేలు పరికరాలు అవసరమవుతాయని గుర్తించారు. ఇప్పటివరకు 600 వరకు అందుబాటులో ఉన్నాయి.
గతేడాది కొన్ని కొనుగోలు కేంద్రాలు తమ లక్ష్యమైపోయిందంటూ ధాన్యం తీసుకునేందుకు నిరాకరించాయి. వీటిని ఈ ఏడాది ఎలా అధిగమించనున్నారు?
ధాన్యం కొనుగోలులో గతేడాది ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మిల్లుల మ్యాపింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రైతులు తమకు సమీపంలో ఉన్న మిల్లులకు ధాన్యం ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ధాన్యం కొనుగోలుకు లక్ష్యం అంటూ పెట్టుకోలేదు కాబట్టి కొనుగోలు కేంద్రాలు తమ లక్ష్యమైపోయాయని చెప్పేందుకు ఆస్కారం ఉండదు.
ధాన్యం మర ఆడించేందుకు ఎన్ని మిల్లులను ఎంపిక చేశారు?
మర ఆడించేందుకు 255 మిల్లులను ఎంపిక చేశాం. వీటిలో 244 సార్టెక్స్‌ ఫోర్టుఫైడ్‌ మిల్లులు, 11 నాన్‌ సార్టెక్స్‌ ఉన్నాయి. మర ఆడించేందుకు ఇస్తున్న ధాన్యం విలువకు సమానమైన బ్యాంకు గ్యారంటీలను మిల్లర్ల నుంచి తీసుకునేందుకు వారితో చర్చిస్తున్నాం. ఇవన్నీ పూర్తి చేసి మరో రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తాం.