
ప్రజాశక్తి-అమరావతి : మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావుకు బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్ స్టేషన్‌లో దేవినేని ఉమపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీతోపాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తనపై తప్పుడు కేసులు బనాయించారని, బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును దేవినేని ఆశ్రయించారు. దీనిపై మంగళవారం ఇరుపక్షాల వాదనలు పూర్తవ్వడంతో బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బెయిల్ మంజూరు ఆదేశాలు జారీ చేశారు.
ఉద్దేశపూర్వకంగానే దేవినేని ఉమపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు పెట్టారని, గ్రామస్తులు సమస్యలు చెప్పడంతోనే దేవినేని మైనింగ్ ప్రదేశానికి వెళ్లారని ఆయన తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వరరావు వాదించారు. దేవినేనిని తమ కస్టడీకి ఇవ్వాలని, విచారణ పూర్తికాలేదని పోలీసులు మచిలీపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.