Aug 08,2021 20:51

వాషింగ్టన్‌ : డెల్టా దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో.. అమెరికాలో రోజువారీ కేసులు లక్షను దాటాయి. చైనా భారీఎత్తున కరోనా పరీక్షలు చేపడుతోంది. శ్రీలంకలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలో శుక్రవారం 1.3 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. జూన్‌ నెల చివరినుండి రోజువారీ కేసుల సంఖ్య 11 వేలకు తగ్గాయి. జులై మొదటి వారంలోనూ కేసుల సంఖ్య 20 వేల కన్నా తక్కువకే పరిమితమయ్యాయి. ఈ నెల 3 నుండి కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. రోజుకి లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది కరోనా మొదటి దశలో రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటడానికి 9 నెలలు పట్టగా ఇప్పుడు 6 వారాల్లోనే ఆ సంఖ్యను దాటడం వ్యాధి తీవ్రతను తెలుపుతోందని అధికారులు వెల్లడించారు. మరణాల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. రెండు వారాల క్రితం రోజుకి 270 కొవిడ్‌ మరణాలు సంభవించగా శుక్రవారం నాటికి ఆ సంఖ్య 700 దాటింది. టీకా తీసుకోని వారిలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 41% ఫ్లోరిడా, జార్జియా, అలబామా, మిసిసిపీ, కరోలినా (ఉత్తర, దక్షిణ), టెన్నెస్సీ, కెంటకీల్లోనే ఉంటున్నారు.

కరోనాను కట్టడి చేసిన చైనాను కూడా డెల్టా వైరస్‌ వణికిస్తోంది. తొలిసారి వైరస్‌ బయటపడిన వుహాన్‌ నగరంలో 1.12 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు (న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్టింగ్‌) జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 4 నుంచి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. శుక్రవారం నాటికి నగరంలో 21 కేసులు బయటపడ్డాయి. హువే ప్రావిన్స్‌లో 47 కేసులు నమోదయ్యాయి. చైనాలో శనివారం 139 మందికి కొత్తగా వైరస్‌ సోకింది.

శ్రీలంకలో కరోనా డెల్టా రకం వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తికీ కొవిడ్‌ ముప్పు పొంచి ఉందని.. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. గత కొద్ది రోజులుగా శ్రీలంకలో కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ''డెల్టా రకం సోకినవారిలో 1.5 శాతం మంది మరణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దేశంలో లాక్‌డౌన్‌ విధించలేదని, ప్రయాణ ఆంక్షలను మాత్రం కొనసాగిస్తున్నట్లు వివరించారు.