Aug 08,2021 07:50
  • జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు అత్యవసర అనుమతి

న్యూఢిల్లీ : భారత్‌లో అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తయారు చేసిన సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌కు అనుమతులు లభించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్షుక్‌ మాండవీయ శనివారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తాజా ఆమోదంతో దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన వ్యాక్సిన్ల సంఖ్య ఐదుకు చేరిందని ఆయన పేర్కొన్నారు. ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ చూపిన సమర్థత, భద్రత ఆధారంగా ఈ నెల 5న భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేశామని, తీవ్రమైన కేసుల్లో 85 శాతం ప్రభావశీలతను చూపిందని ఆ సంస్థ వెల్లడించింది. టీకా వేసిన 28 రోజుల తర్వాత కోవిడ్‌ నుంచి రక్షణ కల్పించడం ప్రారంభమవు తుందని తెలిపింది. బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ సంస్థ సహకారంతో అంతర్జాతీయ సరఫరాను చేపడతామని పేర్కొంది. దేశంలో కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌, రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకాలు అందుబాటులో ఉండగా, అమెరికాకు చెందిన మోడెర్నా టీకాకు ఇటీవల కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది.