
న్యూఢిల్లీ : ఢిల్లీలో క్షీణిస్తున్న వాయు కాలుష్యం '' ప్రజల ఆరోగ్యాన్ని హత్య '' చేస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్.కె. కౌల్, జస్టిస్ సుదాన్షు దౌలియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లలో పంట వ్యర్థాలను తగులబెట్టడంతో ప్రతి శీతాకాలంలో ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుందని పేర్కొంది. పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నిలువరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని హెచ్చరించింది. ఈ సమస్య రాజకీయ యుద్ధంగా మారకూడదని పేర్కొంది.
'' ఈ సమస్యను వెంటనే నిలువరించాలి. ఎటువంటి చర్యలు చేపడతారో మాకు తెలియదు. ఇది రాష్ట్రాల పని. వెంటనే నిలువరించండి. ఇది ఆగాలి. తక్షణమే చర్యలు చేపట్టండి '' అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని, చాలా బస్సులు ప్రయాణించడం కూడా కాలుష్యానికి కారణమౌతుందని, వాటిని సగానికి తగ్గించాలని ధర్మాసనం సూచించింది. ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
పంటవ్యర్థాల దగ్ధం నిలువరించడంపై ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్ , ఢిల్లీ ప్రభుత్వాలతో సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించారు. వాయు కాలుష్యానికి కారణమైన మరో కీలకమైన వాహన ఉద్గారాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది.