ప్రజాశక్తి-కర్లపాలెం: శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలు పెంపొందించేదే రంజాన్ ఉపవాస దీక్ష అని తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు. ఆదివారం కర్లపాలెం మండలంలోని దండుబాట రోడ్డులోని మసీద్ వద్ద ముస్లిములకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగేశన ఫౌండేషన్ ద్వారా పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గత సంవత్సరం కరోనా కారణంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయలేకపోయమని అన్నారు. కానీ ఇమామ్, మౌజన్లకు రంజాన్ తోఫా అందజేశామన్నారు. ఈ సంవత్సరం ముస్లిములకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అదే విధంగా నియోజకవర్గంలోని మసీద్‌ల నిర్మాణం కోసం వేగేశన ఫౌండేషన్ ద్వారా విరాళం అందజేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో రూ.5కే 20 లీటర్ల తాగునీరు ప్రతి ఇంటికి అందిస్తున్నారన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం పెద్దలు మాట్లాడుతూ అల్లా ఎల్లవేళలా నరేంద్రవర్మకు అండగా ఉంటారని తెలిపారు. ఆయన మంచి మనసున్న మారాజు అని అన్నారు. రాబోయే రోజుల్లో ముస్లిములందరూ ఆయనకు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి షేక్ బాజీ, మండల కన్వీనర్ ఏపూరి భూపతిరావు, మాజీ జెడ్పిటిసి గుంపుల కన్నయ్య, మాజీ సర్పంచ్ బొద్దుకూరి విజయ, వసంతరెడ్డి, గపూర్, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.










