
కిడ్నీ వ్యాధి బాధితులకు కానరాని సేవలు
ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో లేని
డయాలసిస్ కేంద్రాలు
డబ్బులు పెట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్న
నిరుపేదలు
ప్రజాశక్తి-రాజోలు
రాజోలుకు చెదిన ఒక వ్యక్తి ఆరు నెలల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఉన్నట్టుండి కాళ్లు వాపులు రావడంతో స్థానిక వైద్యుడిని సంప్రదించి మందులు వాడాడు. అయినా తగ్గక పోవడంతో అమలాపురంలో ఓ ప్రయివేటు కిడ్నీసెంటర్‌కు వెళ్లారు. అక్కడ క్రియాటిన్ టెస్ట్ చేయించారు. 6.2 ఉన్నట్లు తేలింది. మూత్రపిండాలు చెడిపోయినట్లు వైద్యులు తేల్చడంతో కుటంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మొదట్లో మందులు వాడారు. తగ్గలేదు. చివరకు డయాలసిస్ చేయించుకోవాలని డాక్టర్ నిర్ధారించారు. అప్పటి నుంచి వారం రోజులకోసారి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఆసుపత్రిలో బిల్లు తడిసి మోపెడైంది. చేసేది లేక ఇంటికి తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం డయాలసిస్ చేయిస్తున్నారు. ఇది అతనొక్కడి సమస్యే కాదు. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గంలో ఉన్న డయాలసిస్ రోగుల సమస్య.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కిడ్నీ రోగుల సంఖ్య ఆందోళన కలిగించేలా పెరుగుతోంది. గతంలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఆహారపు అలవాట్లలో మార్పులు, నిత్యం ఒత్తిడికి గురికావడంతో పాటు, వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, కలుషిత నీటి వల్ల కిడ్నీ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో 3వేల మంది వరకూ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం అమలాపురంలో మినహ ఎక్కడా ప్రభుత్వ ఉచిత డయాలసిస్ సెంటర్ లేదు. దీంతో రాజోలు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పోరాటం చేసినా ప్రభుత్వం స్పందించలేదు. రాజోలు నియోజకవర్గానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ యనముల వెంకటపతిరాజు ఒఎన్‌జిసి, గెయిల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎన్‌జిటిలో కేసు గెలిచారు. దీంతో రాజోలు ప్రాతంలో రూ.1.50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలోని నాలుగు పడకల డయాలసిస్ సెంటర్‌ని ఏర్పాటు చేసేందుకు రూ.65 లక్షలు కేటాయించారు. కాని నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని పట్టించున్న పాపాన పోలేదు. 8 నెలల క్రితం మంజూరైన డయాలసిస్ కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయడం లేదో తెలియడం లేదని కిడ్నీ వ్యాధిగ్రస్తులు పేర్కొంటున్నారు. దీనిపై రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎ.సూర్యనారాయణ ను వివరణ కోరగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు ఎలాంటి ప్రతిపాదనలు జరగలేదని స్పష్టంచేశారు.
ఒక్కో మండలంలో సుమారు వందకు పైగానే డయాలసిస్ రోగులు ఉన్నారు. దగ్గరలో డయాలసిస్ కేంద్రం లేక జిల్లా కేంద్రంకు పరుగులు తీస్తున్నారు.జిల్లా కేంద్రంలో ఇటీవలే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ.. వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా ఉండటం.. ప్రైవేట్‌లో డబ్బులు ఖర్చు పెట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. సఖినేటిపల్లి, అంతర్వేది నుంచి డయాలసిస్ చేసుకునేందుకు వెళ్లాలంటే.. కారు అద్దెకు తీసుకుని వెళ్లాల్సి వస్తుందని, కారు అద్దె రూ.3 వేలు, డయాలసిస్ రూ.10వేల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందంటున్నారు. డబ్బులు పెట్టుకోలేని నిరుపేద రోగులు చివరకు ప్రాణాలు వదులుతున్నారు.
త్వరగా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
చేవెళ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు మంజూరైన డయాలసిస్ కేంద్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలి. డయాలసిస్ కేంద్రం అందుబాటులో లేక పోవడంతో అమలాపురం లేదా రాజమహేంద్రవరానికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఒక్కసారికి రూ.10 వేల వరకూ ఖర్చుచేయాల్సి వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే పేదలకు ఆసరాగా ఉంటుంది. దీనికి సంబంధించి రూ.65 లక్షల మంజూరైనా అడుగులు పడకపోవడం గమనార్హం. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి.
- యనముల వెంకటపతి రాజు,ఎన్‌ఆర్‌ఐ
త్వరగా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
రాజోలు నియోజకవర్గంలో చాలా మంది పేదలు కిడ్నీ బాధిత సమస్యలతో బాధపడుతున్నారు. వీరందరూ అమలాపురం, కాకినాడ లేదా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కోసం వెళ్తున్నారు. రాజోలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత రక్తశుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తే స్థానికులకు కొంత మేర వెసులుబాటు కలుగుతుంది.
- భూపతి అజరు కుమార్, సామజిక వేత్త,రాజోలు