Mar 11,2023 22:52

10 వాహనాలు స్వాధీనం
ప్రజాశక్తి-విజయవాడ 

ద్విచక్రవాహనాలను దొంగి లిస్తున్న దొంగను కృష్ణలంక పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడికి చెందిన కుంచనపల్లి గంగాధరరావు (ప్రస్తుతం అమలాపురంలో నివాసం)ను స్థానిక పిఎన్‌ బస్‌స్టాండ్‌ వద్ద శనివారం అదుపులోకి అతని వద్ద నుంచి రూ. ఐదు లక్షల విలువ చేసే 10 ద్విచక్రవాహనాలను (చోరీ సొత్తు) స్వాధీనం చేసుకొని అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు పోలీస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్‌ జోన్‌ఎసిపి రవికిరణ్‌ మాట్లాడుతూ...విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టాండ్‌ వద్ద ఎక్కువుగా ద్విచక్రవాహనాలు పోతున్నాయని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఆ ప్రాంతాల్లో నిఘా పెంచి బైక్‌ దొంగతనాలు చేస్తున్న కుంచనపల్లి గంగాధరరావుఅనే నిందితుడిని అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి 10 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితుడు కరోనాకు ముందు తన అత్తగారి ఊరు అయిన అమలాపురం వెళ్లి అక్కడే ఉంటున్నాడన్నారు.. జల్సాలకు అలవాటు పడిన గంగాధరరావు తన సంపాదనతో వచ్చే డబ్బులు చాలక సులువుగా డబ్బు సంపాదించాలని, ద్విచక్రవాహనాలను మారు తాళాలతో దొంగిలించి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుండేవాడన్నారు. అమలాపురంలో దొంగతనాలుచేసే దొరికిపోతానని భావించిన నిందితుడు, విజయవాడ వచ్చి బస్టాండ్‌ వద్ద తరుచూ బైక్‌లు దొంగతనాలు చేస్తూ...వాటిని రామవరప్పాడు రింగ్‌ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో దాచిపెట్టి అక్కడి నుంచి అమలాపురం తన ఇంటికి వెళ్లి పోతుండేవాడన్నారు. ఈ విధంగా ఈ ఏడాది జనవరి నుంచి బస్టాండ్‌ సమీపంలో వివిధ ప్రదేశాల్లో పార్కింగ్‌ చేసి ఉన్న 10 బైక్‌లను దొంగిలించాడన్నారు. శనివారం వాటిల్లో ఒక బైక్‌ను గుంటూరులో అమ్ముకొని వచ్చిన డబ్బుతో జల్సా చేద్దామని ఒక బైక్‌ను విజయవాడ మీదుగా గుంటూరు వెళ్తున్న సమయములో స్క్రూబ్రిడ్జి వద్ద పోలీసులు గంగాధరరావును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు వెలుగు చూశాయన్నారు. అతన్ని అరెస్ట్‌చేసి అతని వద్ద నుంచి 10 బైక్‌లు స్వాధీనం చేసుకొని, నిందితుడిని విజయవాడ జైల్‌కు పంపించినట్లు ఎసిపి తెలిపారు. ఈ సమావేశంలో స్టేషన్‌ సిఐ దుర్గారావు, క్రైమ్‌ ఎస్‌ఐ కృష్ణబాబు పాల్గొన్నారు.