Aug 17,2023 00:12

ఆందోళన చేస్తున్న ద్వారకానగర్‌ వాసులు

ప్రజాశక్తి-చోడవరం
చోడవరంలోని ద్వారక నగర్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కాలనీవాసులు తాహశీల్దార్‌, ఎంపీడిఓ, గ్రామపంచాయతీ, విద్యుత్‌ శాఖ కార్యాలయాల వద్ద బుధవారం ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ద్వారకా నగర్‌ సంక్షేమ సంఘం, దళిత విముక్తి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్‌ సుర్ల వెంకటరమణ మాట్లాడుతూ చోడవరం పంచాయతీ 11, 12 వార్డుల్లో గల ద్వారకా నగర్‌లో 50 ఏళ్లకు పైగా 300 కుటుంబాలు నివాసముంటున్నాయని తెలిపారు. వారికి తగినన్ని మంచినీటి కుళాయిలు, సిమెంట్‌ రోడ్లు, మురుగునీరు కాలువలు, మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఇళ్లకు కరెంటు లేదన్నారు. ఈ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. కోర్టు కేసులు ఉన్నాయంటూ సాకులు చెబుతున్నారని, కాని మౌలిక సదుపాయాలు కల్పించవద్దని కోర్టు చెప్పలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత విముక్తి ప్రతినిధులు బంకపల్లి అప్పారావు, బి.సన్యాసమ్మ, కిలపర్తి జగదీష్‌, ద్వారక నగర్‌ సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు ఎస్‌.సంజీవ్సె, ఎస్కే హుస్సేన్జా, డి బోడయ్య, వి సతీష్‌, ఎస్‌ ఈశ్వరి, దావీదు, మోతి పేరమ్మ, తారాబి, చిన్నయ్య, డి బాబు, డి చంటి, ఎస్‌కే శ్రీను, ఎస్‌కే రెహమాన్‌, డి గొల్లయ్య, జగదీష్‌, రాజబాబు, జ్యోతి, బషీర్‌, డి.మహేష్‌, లక్ష్మి పాల్గొన్నారు.