
ప్రజాశక్తి-విజయనగరంకోట : డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ఆదరించి ప్రోత్సహించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. నగరంలోని దిగువ ట్యాంక్‌బండ్ రోడ్డులో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ ను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 250కి పైగా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటవుతున్నాయని చెప్పారు. మహిళలకు అవసరమైన వస్త్రాలు, హస్తకళాకతులు, తినుబండారాలు, గహాలంకరణ వస్తువులు సహా ఎన్నో రకాల వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయని, నగర, జిల్లా ప్రజలు దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటికే 150 స్టాల్స్ ఏర్పాటయ్యాయని, మిగిలినవి కూడా ఆదివారం ఉదయానికి ఏర్పాటవుతున్నట్టు చెప్పారు.
డిసిసిబి, ఆప్కాబ్ స్టాల్స్‌ను ప్రారంభించడంతో పాటు అన్ని స్టాళ్లను సందర్శించి ఆయా మహిళలతో మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, నగర మేయర్ వి.విజయలక్ష్మి, డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.